నిషేధిత ఆజ్ఞల నేపథ్యంలో.. వినూత్న ఆలోచన

14 Sep, 2019 12:57 IST|Sakshi

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆజం ఖాన్‌ మీద రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, ఆజంఖాన్‌కు మద్దతుగా రాంపూర్‌ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాంపూర్‌ ప్రాంతంలో 144 సెక్షన్‌ని విధించారు. అయితే ఆ పార్టీ నాయకుడొకరు ఈ నిషేధాజ్ఞలను వినూత్న రీతిలో ఉల్లంఘించాడు. అఖిలేష్‌ను కలవడం కోసం ఏకంగా పెళ్లి కుమారుడి వేషంలో వచ్చాడు.

ఆ వివరాలు.. రాంపూర్‌లో పర్యటిస్తున్న అఖిలేష్‌ను కలవడం కోసం సంభల్‌కు చెందిన ఆ పార్టీ నాయకుడు ఫిరోజ్‌ ఖాన్‌, కార్యకర్తలతో కలిసి పెళ్లి కుమారుడి వేషంలో వచ్చారు. ఈ సందర్భంగా అఖిలేష్‌ మాట్లాడుతూ.. ‘యోగి ప్రభుత్వం మా పార్టీ ఎంపీని టార్గెట్‌ చేసింది. నెల రోజుల వ్యవధిలోనే ఆయన మీద దాదాపు 80 కేసులు పెట్టింది. వాటిల్లో బర్రె, మేక దొంగతనం కేసులు కూడా ఉండటం గమనార్హం. ఇవన్ని నిరాధార ఆరోపణలు. ప్రభుత్వం ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ప్రజలు ఆజం ఖాన్‌పైనే విశ్వాసం ఉంచుతార’ని పేర్కొన్నాడు.
(చదవండి: గేదెను దొంగిలించాడని ఎంపీపై కేసు)

ఆజం ఖాన్‌ ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడినట్లు జిల్లా యంత్రాంగం నుంచి అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ భూములతోపాటు పేద రైతులనుంచి వ్యవసాయ భూములను కూడా స్వాహా చేశాడంటూ అతనిపై వరుస కేసులు నమోదైనాయి. ఈ నేపథ్యంలోనే జూలై 29న యూపీ ప్రభుత్వం ఆజం ఖాన్‌ను ల్యాండ్ మాఫియాగా ప్రకటించింది. అలాగే ఖాన్‌కు చెంది మహమ్మద్‌ అలీ జౌహార్యూనివర్శిటీకి విదేశీ విరాళాలకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై  ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం (ఈడీ) కూడా విచారణ చేపట్టింది. ఆయనపై నమోదైన కేసుల (30 దాకా)  వివరాలపై స్థానిక అధికారులను ఆరా తీస్తోంది.

మరిన్ని వార్తలు