సనత్‌ ఇదేం పని..

22 Nov, 2018 14:33 IST|Sakshi

కొలంబో : శ్రీలంక మాజీ క్రికెటర్‌ సనత్‌ జయసూర్య, మరో ఇద్దరు క్రికెటర్లు భారత్‌కు కుళ్లిన వక్కలను స్మగ్లింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలున్నాయని దైనిక్‌ భాస్కర్‌ వెల్లడించింది. నాగపూర్‌లో రూ కోట్లు విలువైన ముడి వక్కలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ అక్రమ దందాలో జయసూర్య పేరు వెలుగులోకి వచ్చిందని ఆ కథనం పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి విచారించేందుకు జయసూర్యను రెవిన్యూ ఇంటెలిజెన్స్‌ బృందం ముంబైకి పిలిపించినట్టు సమాచారం.

అధికారుల కళ్లుగప్పి సాగిన ఈ అక్రమ దందాలో మరో ఇద్దరు క్రికెటర్ల ప్రమేయం ఉన్నా వారి పేర్లు ఇంకా వెల్లడికాలేదని తెలిసింది. డిసెంబర్‌ 2న జరిగే విచారణకు వారు హాజరయ్యే అవకాశం ఉందని దైనిక్‌ భాస్కర్‌ కథనం తెలిపింది. ఇండోనేషియా నుంచి శ్రీలంకకు తరలించిన వక్కలను తర్వాత వారు భారత్‌కు చేరవేస్తున్నారని రెవిన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు వెల్లడించారు.

దక్షిణాసియా స్వేచ్ఛా వర్తక ప్రాంత చట్టాన్ని ఆసరాగా చేసుకుని మాజీ క్రికెటర్లు డమ్మీ కంపెనీలతో అక్రమ లావాదేవీలు సాగించినట్టు సమాచారం. ఈ చట్టం ప్రకారం భారత్‌, శ్రీలంకల మధ్య దేశీయంగా రూపొందే ఉత్పత్తుల పన్ను రహిత రవాణాకు అనుమతిస్తారు. మాజీ క్రికెటర్లు తమకున్న పలుకుబడితో డమ్మీ కంపెనీల ద్వారా శ్రీలంక అధికారుల నుంచి ట్రేడ్‌, ఎగుమతి లైసెన్సులు పొంది, వక్కలను శ్రీలంకలోనే తయారైనట్టు నకిలీ పత్రాలు రూపొందించి సరుకును భారత్‌కు తరలిస్తున్నట్టు ఈ కథనం పేర్కొంది.

>
మరిన్ని వార్తలు