‘ఇమ్రాన్‌.. మా పేరును విశ్వవ్యాప్తం చేశారు’

28 Sep, 2019 16:09 IST|Sakshi

న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితిలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ పేరును లేవనెత్తి భారత్‌-ఆరెస్సెస్‌ పర్యాయ పదాలని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రపంచానికి చాటిచెప్పారని ఆ సంస్థ కార్యకర్త కృష్ణ గోపాల్‌ అన్నారు. తమకు ఇంత గొప్ప సహాయం చేసినందుకు ఆయనను తప్పక అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో శుక్రవారం తొలిసారిగా ప్రసంగించిన పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆరెస్సెస్‌ పేరును కూడా ఆయన ప్రస్తావించారు. ‘భారత్‌లో ఆరెస్సెస్‌ అనే సంస్థ ఉంది. ఆ దేశ ప్రధాని మోదీ అందులో జీవితకాల సభ్యుడు. హిట్లర్‌, ముస్సోలినిల స్ఫూర్తితో ఏర్పడిన ఆ సంస్థ.. ముస్లింలు, క్రిస్టియన్లపై ద్వేషాన్ని పెంచుతోంది’ అని వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ వ్యాఖ్యలపై స్పందించిన కృష్ణ గోపాల్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘ఆరెస్సెస్‌ భారత్‌ కోసం భారత్‌లో మాత్రమే పనిచేస్తోంది. ప్రపంచంలో మరెక్కడా మాకు శాఖలు లేవు. అయినా పాకిస్తాన్‌కు మాపై కోపం ఎందుకు? వాళ్లు మాపై కోపంగా ఉన్నారంటే భారత్‌పై కోపంగా ఉన్నట్లే. ఆరెస్సెస్‌, భారత్‌ పర్యాయపదాలుగా మారాయని ఇమ్రాన్‌ మాటల్లో స్పష్టమైంది. నిజానికి ప్రపంచం కూడా మమ్మల్ని ఇలాగే గుర్తించాలని మేము ఆశించాం. ఆరెస్సెస్‌ పేరును ప్రస్తావించి ఇమ్రాన్‌ చాలా గొప్ప సహాయం చేశారు. మా పేరును ప్రపంచవ్యాప్తం చేశారు. ధన్యవాదాలు. ఉగ్రవాద బాధితులకు ఆరెస్సెస్‌ అండగా ఉంటుంది. బహుశా అందుకే ఇమ్రాన్‌కు మాపై కోపం వస్తున్నట్లుంది’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక తమ గురించి ప్రచారం చేసింది చాలు అని, పాకిస్తాన్‌ పరిస్థితులపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు.

మరిన్ని వార్తలు