మహా కౌంట్‌డౌన్‌ : బీజేపీ విఫలమైతే సేన రెడీ..

10 Nov, 2019 11:48 IST|Sakshi

ముంబై : మహారాష్ట్రలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధంగా ఉన్నామని శివసేన స్పష్టం చేసింది. గవర్నర్‌ ఆహ్వానం మేరకు అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ చేసుకోవాలని, ఇందులో ఆ పార్టీ విఫలమైతే ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీ ముందుకు వస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం లోగా బలనిరూపణ చేసుకోవాలని తాత్కాలిక సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను మహారాష్ట్ర గవర్నర్‌ కోరిన సంగతి తెలిసిందే. గవర్నర్‌ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తామని, ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం దీర్ఘకాలం అనిశ్చితి కొనసాగడం మంచిది కాదని చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి తెరదించడంలో బీజేపీ విఫలమైతే తాము ఆ బాధ్యతను చేపడతామని చెప్పారు. రాజకీయాల్లో ఒప్పందాలకు తమ పార్టీ వ్యతిరేకమని, శివసేన డిక్షనరీలో డీల్‌ అనే పదమే లేదని బీజేపీపై ధ్వజమెత్తారు. మరోవైపు అయోధ్య తీర్పును శివసేన స్వాగతిస్తుందని సంజయ్‌ రౌత్‌ తెలిపారు. కాగా పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో బీజేపీని హిట్లర్‌తో పోల్చుతూ శివసేన విమర్శలతో విరుచుకుపడింది. మహారాష్ట్రలో చెరి రెండున్నరేళ్లు అధికారం పంచుకోవాలన్న శివసేన డిమాండ్‌ను బీజేపీ తోసిపుచ్చడంతో ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. మరోవైపు మందిర్‌ అంశం ఏ ఒక్క పార్టీకో సంబంధించిన విషయం కాదని, దేశవ్యాప్తంగా దీనిపై ప్రజల్లో ఆందోళన ఉందని చెప్పారు. గతంలో పలువురు శివసైనికులు రామ మందిర ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తుచేశారు.

>
మరిన్ని వార్తలు