‘శరవణ’ రాజగోపాల్‌ కన్నుమూత

19 Jul, 2019 04:13 IST|Sakshi
రాజగోపాల్‌ (ఫైల్‌)

చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

సాక్షి ప్రతినిధి, చెన్నై: దక్షిణ భారత ఆహారాన్ని అందించడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన శరవణ భవన్‌ హోటళ్ల గ్రూప్‌ అధినేత పి.రాజగోపాల్‌ (73), కోర్టు విధించిన యావజ్జీవ జైలు శిక్షను అనుభవించడానికి ముందే గురువారం కన్నుమూశారు. 2001లో ఓ ఉద్యోగిని హత్య చేసిన కేసులో రాజగోపాల్‌ యావజ్జీవ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంది. ఇందుకోసం ఆయన పది రోజుల క్రితమే కోర్టులో లొంగిపోయారు కూడా. ఆ వెంటనే అనారోగ్యం కారణంగా రాజగోపాల్‌ ఆసుపత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం 10 గంటలకు మరణించారు.

ఆయన అనారోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను వైద్యులు వెల్లడించలేదు. జ్యోతిష్యుడు చెప్పాడంటూ తన దగ్గర పనిచేస్తున్న ఓ ఉద్యోగి కూతురిని రాజగోపాల్‌ మూడో పెళ్లిచేసుకోవాలనుకోగా, అందుకు ఆమె ఒప్పుకోకుండా శరవణ భవన్‌లోనే పనిచేస్తున్న శాంతకుమార్‌ అనే ఉద్యోగిని వివాహం చేసుకుంది. దీంతో ఎలాగైనా ఆమెను పెళ్లిచేసుకునేందుకు శాంతకుమార్‌ను రాజగోపాల్‌ హత్య చేయించాడు. ఈ కేసులో రాజగోపాల్‌తోపాటు మరో ఎనిమిది మందికి జైలు శిక్ష పడింది. ఆ శిక్షను అనుభవించకుండానే రాజగోపాల్‌ గురువారం కన్ను మూశాడు. కాగా, రాజగోపాల్‌ స్థాపించిన శరవణ భవన్‌ హోటళ్లు ఇండియాలోని పలు నగరాలతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అమెరికా, బ్రిటన్‌ సహా 20 దేశాల్లో విస్తరించి ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు