‘శరవణ’ పిటిషన్‌ కొట్టివేత

10 Jul, 2019 04:20 IST|Sakshi
చెన్నై కోర్టు వద్ద రాజగోపాల్‌

సుప్రీంకోర్డు ఆదేశాలతో చెన్నై కోర్టులో లొంగిపోయిన రాజగోపాల్‌

న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: అనారోగ్యంతో ఉన్న కారణంగా జైలుకు వెళ్లేందుకు తనకు మరికొంత సమయం కావాలంటూ ‘శరవణ భవన్‌’ హోటళ్ల యజమాని పి.రాజగోపాల్‌ చేసుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. దీంతో ఆయన చెన్నైలోని సెషన్‌కోర్టులో లొంగిపోయారు. దక్షిణ భారత ఆహారాన్ని అందించడంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘శరవణ భవన్‌’ హోటళ్లను స్థాపించిన రాజగోపాల్‌ ఓ హత్య కేసులో దోషి. ఇద్దరు భార్యలున్న రాజగోపాల్‌ జ్యోతిష్యాన్ని బాగా నమ్మేవాడు.

2001లో ఓ జ్యోతిష్యుడి మాటను నమ్మిన రాజగోపాల్, తన దగ్గర పనిచేస్తున్న శాంతకుమార్‌ అనే ఉద్యోగి భార్యను మూడో పెళ్లి చేసుకునేందుకు శాంతకుమార్‌ను అంతమొందించాడు. ఈ కేసులో 2004లో కింది కోర్టు ఆయనతోపాటు మరో 8 మందికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించగా, వారంతా హైకోర్టులో అప్పీల్‌ చేసుకోవడంతో మద్రాసు హైకోర్టు 2009లో శిక్షను పదేళ్ల నుంచి యావజ్జీవానికి పెంచింది. మద్రాసు హైకోర్టు వేసిన శిక్షను ఇటీవలే సుప్రీంకోర్టు సమర్థించింది.

మరిన్ని వార్తలు