మృతదేహాన్ని చాపలో చుట్టి.. సైకిల్‌కు కట్టుకుని..

20 Apr, 2017 08:11 IST|Sakshi
మృతదేహాన్ని చాపలో చుట్టి.. సైకిల్‌కు కట్టుకుని..

గువాహటి: తన భార్య మృతదేహాన్ని ఒడిశా గిరిజనుడు భుజాలపై మోసుకుంటూ కిలోమీటర్లు నడిచిన ఘటనను మరవకముందే అసోంలో ఇటువంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. ఒక గిరిజనుడు తన తమ్ముడి మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి సైకిల్‌పై తీసుకెళ్లాల్సి వచ్చింది.  ఈ హృదయ విదారక దృశ్యం స్థానిక చానళ్లలో ప్రసారం కావడంతో ఆ రాష్ట్ర సీఎం సర్బానంద సోనోవాల్‌ బుధవారం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మజూలి నియోజకవర్గంలోనే ఈ ఘటన జరగడంతో ఆయన ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.

బలిజయన్‌ గ్రామానికి చెందిన డింపుల్‌దాస్‌ (18) శ్వాసకోశవ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతదేహం తరలింపునకు ఆస్పత్రి అధికారులు ఏర్పాట్లు చేస్తుండగానే, దాస్‌ సోదరుడు మృతదేహాన్ని చాపలో చుట్టి సైకిల్‌కు కట్టుకుని ఇంటికి బయల్దేరాడని అధికారులు చెబుతున్నారు. మరోవైపు బాధితుడి గ్రామానికి వాహనాలు వెళ్లేందుకు రోడ్డు మార్గమే లేదు. ఓ కాలువపై వెదురు బొంగులతో నిర్మించిన బ్రిడ్జిని దాటి ఆ గ్రామానికి చేరుకోవాలి. ఆర్థిక స్థోమత లేకపోవడంతో తమ్ముడి మృతదేహాన్ని చాపలో చుట్టుకుని ఇంటికి తీసుకెళ్లడంతో అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ ఘటనపై విచారణకు సీఎం ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు.

>
మరిన్ని వార్తలు