నవ కశ్మీరం

31 Oct, 2019 03:29 IST|Sakshi

కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్, లదాఖ్‌

పునర్‌వ్యవస్థీకరణ చట్టం నేటి నుంచి అమలు

శ్రీనగర్‌: అక్టోబర్‌ 31. ఈ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి ఇదే రోజు. 500కిపైగా విడివిడిగా ఉన్న సంస్థానాలను మన దేశంలో కలపడానికి కృషి చేసిన మహనీయుడాయన. అప్పటి ప్రధాని నెహ్రూ పాక్‌ సరిహద్దుల్లో ఉన్న సమస్యాత్మక ప్రాంతమైన  కశ్మీర్‌ను భారత్‌లో కలపడానికి పటేల్‌కు అనుమతినివ్వలేదు. ఫలితంగా ఇన్నాళ్లూ ఆ సమస్య రావణకాష్టంలా రగిలింది. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్లకు పటేల్‌ జయంతి రోజే కశ్మీర్‌లో నవ శకానికి నాంది పలికింది.

ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్‌ అప్పట్లో రాజ్యాంగంలో జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని ఆగస్టు 5న రద్దు చేసింది. కశ్మీర్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి ఓకే చెప్పింది. పటేల్‌ జయంతి అయిన నేటి నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు అమల్లోకి వచ్చిన ఈ చట్టంతో 173 ఏళ్ల చరిత్ర కలిగిన జమ్మూ కశ్మీర్‌ కథ ఇక గతం. జమ్ము కశ్మీర్, లదాఖ్‌ ప్రాంతాలు కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ చట్టం ప్రకారం అసెంబ్లీఉన్న కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్, పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతంగా లదాఖ్‌ అవతరించాయి.  

శాంతి భద్రతలు కేంద్రం చేతుల్లోనే
జమ్మూకశ్మీర్‌లో శాంతి భద్రతలన్నీ గురువారం నుంచి నేరుగా కేంద్రం చేతుల్లోకి వెళ్లనున్నాయి. పోలీసు యంత్రాంగం యావత్తూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధీనంలో నడుచుకుంటుంది. కేంద్రం నియమించిన లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌కే సర్వాధికారాలు ఉంటాయి. భూ లావాదేవీల వ్యవహారాలన్నీ ప్రభుత్వ అధీనంలో ఉంటాయి.   యూటీగా మారిన కశ్మీర్‌ అసెంబ్లీకి శాంతి భద్రతలు, పోలీసు యంత్రాంగం, పబ్లిక్‌ ఆర్డర్‌ మినహా మిగిలిన అన్ని అంశాల్లోనూ చట్టాలు చేసే అధికారాలున్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఏసీబీ వంటివన్నీ కేంద్రం నియమించిన లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ పరిధిలోనే పనిచేస్తాయి. ఇక జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికయ్యే ప్రభుత్వ అసెంబ్లీ స్థానాలు 107గా ఉన్నాయి. నియోజకవర్గాల పునర్‌ వ్యవస్థీకరణ చట్టం అమల్లోకి వచ్చాక తర్వాత వాటి సంఖ్య 114కి పెరుగుతుంది. లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ సిఫారసు లేనిదే ఆర్థిక బిల్లులేవీ అసెంబ్లీలో ప్రవేశపెట్టే అధికారాలు కొత్త ప్రభుత్వానికి ఉండవు. ఇక, లదాఖ్‌కు శాసనసభ అంటూ ఏమీ ఉండదు. ఇది పూర్తిగా కేంద్ర నియంత్రణలోనే ఉంటుంది.

ఎల్‌జీల ప్రమాణం నేడే
జమ్మూ కశ్మీర్‌ కొత్త లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) గా ఐఏఎస్‌ అధికారి గిరీశ్‌ చంద్ర ముర్ము, లదాఖ్‌æ ఎల్‌జీగా  ఆర్‌కే మాథూర్‌లను కేంద్రం నియమించింది. గురువారం నాడు శ్రీనగర్, లేహ్‌లలో జరిగే కార్యక్రమాల్లో ఈ ఇద్దరు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్స్‌ పదవీ ప్రమాణం చేయనున్నారు. వీరిద్దరితో కశ్మీర్‌ హైకోర్టు సీజే గీత ప్రమాణం చేయిస్తారు.

మరిన్ని వార్తలు