'సీఎం నన్ను లైంగికంగా వేధించారు'

4 Apr, 2016 06:06 IST|Sakshi
'సీఎం నన్ను లైంగికంగా వేధించారు'

తిరువనంతపురం: కేరళ రాజకీయాల్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన సరితా నాయర్ కు సంబంధించిన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీపై తీవ్రమైన ఆరోపణలతో ఆమె రాసిన లేఖ తాజాగా వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. తనను ఊమెన్ చాందీ లైంగికంగా వేధించారని ఆమె రాసిన లేఖ ప్రతిని ఆసియన్ నెట్ న్యూస్ ఛానల్ వెలుగులోకి తెచ్చింది. 2013, మార్చి 19న రాసినట్టుగా చెబుతున్న ఈ లేఖలో సంచలనాత్మక విషయాలున్నాయి.

ఊమెన్ చాందీతో పాటు కేంద్ర మాజీ మంత్రి తనను లైంగికంగా వేధించారని లేఖలో సరిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి లంచం కూడా ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ లేఖను అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కు ఆమె ఇవ్వాలనుకున్నారు. ముఖ్యమంత్రి చాందీపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి. చాందీ కుమారుడు తనను వేధింపులకు గురిచేశారని గతంలో ఆమె ఆరోపించారు.
 

ఈ లేఖ తనదేనని సరితా నాయర్ తెలిపారు. 'ఆ లేఖ నాదే. పోలీసు కస్టడీలో ఉండగా రాశాను. అందులోని విషయాల గురించి చర్చించాలనుకోవడం లేదు. కానీ లేఖలో నేను రాసివన్నీ వాస్తవాలే' అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తనపై పథకం ప్రకారం కుట్ర చేశారని చాందీ ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని దించడానికి చివరి ప్రయత్నంగా దీన్ని వర్ణించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని అన్నారు. సోలార్ కుంభకోణంలో సహ నిందితురాలిగా ఉన్న సరితా నాయర్ గతంలోనూ చాందీపై పలు ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు.

మరిన్ని వార్తలు