ఎంతో ఆశతో ఉన్నాం!

22 Mar, 2018 09:44 IST|Sakshi

జయలలిత గార్డెన్‌కు వచ్చేస్తారని భావించా

హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించింది

జైలు జీవితమే ఆమెను కుంగదీసింది.

వెలుగులోకి  చిన్నమ్మ ప్రమాణ పత్రం

గవర్నర్‌తో పాటు మంత్రులు అనేకమంది అక్కను చూశారని శశికళ వాంగ్మూలం

‘‘ఆస్పత్రి నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అయ్యి.. అక్క జయలలిత కారు ముందు సీట్లో.. నేను వెనుక కూర్చుని ఇంటికి వెళ్తామని నమ్మకం, ఆశతో ఉన్నాం. అయితే, ఆమె ఈ లోకం విడిచి మమ్మల్ని తీవ్ర మనో వేదనను మిగిల్చింది. జైలు జీవితం అక్కను తీవ్రంగా కుంగదీసింది. డిసెంబరు 4వ తేదీ అక్క టీవీలో జై హనుమాన్‌ సీరియల్‌ చూస్తున్న సమయంలో కాఫీ ఇచ్చాను. సీరియల్‌ ముగిసిన తర్వాత కాఫీ తాగుతానని ఆమె చెప్పారు. క్షణాల్లో ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆమె శరీరం వణుకుతోంది.. అక్కా.. అక్కా అంటూ నేను అరిచాను.. కళ్లు తెరిచినట్టు తెరిచి చివరకు మూతపడింది. అంతే నేను స్పృహ తప్పిపడిపోయా’’ అంటూ శశికళ విచారణ కమిషన్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

సాక్షి, చెన్నై :  ఆస్పత్రి నుంచి సంపూర్ణ ఆరోగ్య వంతురాలుగా పోయెస్‌ గార్డెన్‌కు అక్క జయలలిత వచ్చేస్తారన్న ఆశతో ఉన్నామని ఆమె నెచ్చెలి శశికళ వ్యాఖ్యానించారు. హఠాత్తుగా ఆమె ఆరోగ్యం ఆస్పత్రిలో క్షీణించిందని ఆవేదన వ్యక్తంచేశారు. జైలు జీవితం అక్కను తీవ్రంగా కుంగదీసిందని పేర్కొన్నారు. ఈమేరకు రిటైర్డ్‌  న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిషన్‌కు శశికళ వాంగ్మూలం ఇచ్చారు. తమిళ ప్రజల అమ్మ మరణం ఓ మిస్టరీగా మారిన విషయం తెలిసిందే. ఈ మిస్టరీని నిగ్గు తేల్చేందుకు ఆర్ముగ స్వామి కమిషన్‌ తీవ్ర విచారణ సాగిస్తూ వస్తోంది. అన్ని కోణాల్లోనూ, జయలలితకు సన్నిహితంగా ఉన్న వాళ్లు, భద్రతాధికారులు, ప్రభుత్వ అధికారులు, ఇంటి పని మనుషుల్ని సైతం ఆ కమిషన్‌ విచారిస్తూ వస్తోంది. జయలలిత నెచ్చెలి శశికళ పరప్పన అగ్రహార చెరలో ఉండడంతో ఆమె వాంగ్ములాన్ని ప్రమాణ పత్రం రూపంలో సమర్పించేందుకు ఆదేశించారు. దీంతో ఆమె తరఫు న్యాయవాది రాజ చెందూర్‌ పాండియన్‌ 55 పేజీలతో కూడిన ప్రమాణ పత్రాన్ని కమిషన్‌కు గత వారం సమర్పించారు. అందులో ఏముందో అన్న ఉత్కంఠకు తెర పడుతూ ఆ వివరాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి.

అపోలోలో చికిత్స–పరామర్శ
అపోలో ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి డిసెంబరు ఐదో తేదీ వరకు జయలలితకు అందించిన వైద్య చికిత్సలు, డాక్టర్ల గురించి ప్రమాణ పత్రంలో శశికళ వివరించారు. జ్వరంతోనే ఆస్పత్రికి వచ్చిన క్రమంలో ఆమెకు ఇతర వైద్య పరీక్షలు చేయాల్సి వచ్చింది. ఆస్పత్రిలో జయలలిత కోలుకున్నట్టు, ఆమె పోయెస్‌ గార్డెన్‌కు మళ్లీ వచ్చేస్తారన్న ఆశతో ఉన్నట్టు పేర్కొన్నారు. సెప్టెంబరు 27వ తేదీ కావేరి సమస్య విషయంగా ఆమె అధికారులతో సమావేశం కూడా అయ్యారని వివరించారు. ఈ సమయంలో అప్పటి ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం, ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్‌ జయలలితను కలిసినట్టు, పార్లమెంట్‌ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై, కార్మిక శాఖ మంత్రి నిలోఫర్‌ కబిల్, భద్రతాధికారులు సైతం జయలలితను చూశారని పేర్కొన్నారు. వారి వద్ద తాను వచ్చేస్తానని, ఎవరూ ఇక రావద్దని జయలలిత స్వయంగా సూచించారని తెలిపారు. గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు సైతం జయలలితను చూసిన వారిలో ఉన్నట్టు తెలిపారు. ఆమె స్పృహలో లేని దృష్ట్యా, ఆస్పత్రికి తీసుకురాగలిగామని, స్పృహలో ఉండి ఉంటే అంగీకరించే వారు కారని తెలిపారు.

జైలు జీవితంతో..
అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చాక, అక్క జయలలిత మనో వేదనలో పడ్డారని, తాను పదే పదే దాని గురించి ఆలోచించ వద్దు అని సూచించినట్టు తెలిపారు.  జైలుకు వెళ్లి వచ్చిన అనంతరం ఆమెకు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన 20 మంది వైద్య నిపుణుల ద్వారా పోయెస్‌ గార్డెన్‌లోనే వైద్య పరీక్షలు చేశామని పేర్కొంటూ, అందుకు తగ్గ వీడియో క్లిప్పింగ్‌లు, అపోలోలో తీసిన వీడియోలను కమిషన్‌కు సమర్పించడం గమనార్హం. అలాగే, బీ ఫామ్‌లో సంతకం పెట్టే సమయంలో స్పృహలోనే ఉన్నట్టు పేర్కొన్నారు.  

జ్వరంతో..
సెప్టెంబరు 19న జయ జ్వరం బారినపడ్డారు. ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్‌ శివకుమార్‌ శబరిమలైకి వెళ్లారు. ఆయన్ను ఫోన్‌ ద్వారా సంప్రదించి, అందుకు తగ్గ మందుల్ని అందించారు. జ్వరం కాస్త తగ్గడంతో  21వ తేదీ మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జయలలిత వెళ్లారు. అక్కడి నుంచి రాగానే, జ్వరం మరింతగా పెరిగింది. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో 22వ తేదీ ఆమె బయటకు రాలేదు. అదేరోజు రాత్రి 9.30 గంటలకు మొదటి అంతస్తు నుంచి వచ్చిన జయ కేకతో శశికళ పరుగులు తీశారు. బాత్రూం వద్ద పడి ఉన్న జయలలిత మంచం మీదకు తీసుకొచ్చారు. జ్వరం తీవ్రతకు తోడుగా ఆమె స్పృహ తప్పడంతో డాక్టర్‌ శివకుమార్‌ను పిలిపించి హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్‌లో శశికళ, శివకుమార్‌ ఉన్నారు. మార్గం మధ్యలో జయలలిత çస్పృహలోకి వచ్చి ఆస్పత్రికి వద్దు అని మారం చేశారు. అప్పటికే అంబులెన్స్‌ ఆస్పత్రికి చేరింది.

అక్కా...అక్కా..
వైద్య పరీక్షలు, చికిత్సలు, పరామర్శలు, వీడియో చిత్రీకరణ తదితర అంశాల గురించి సమగ్రంగా వివరించిన శశికళ, జయలలిత ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించిన సందర్భాన్ని ప్రమాణ పత్రం ద్వారా కమిషన్‌ ముందు పూసగుచ్చినట్టు తెలియజేశారు. డిసెంబరు 4వ తేదీ జయలలిత టీవీలో జై హనుమాన్‌ సీరియల్‌ చూస్తున్న సమయంలో కాఫీ ఇచ్చామని, సీరియల్‌ ముగిసినానంతరం కాఫీ తాగుతానని చెప్పిన అక్క ఆరోగ్యం క్షణాల్లో క్షీణించినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె శరీరం వణుకుతుండడంతో అక్కా..అక్కా అంటూ అరిచానని, అంతలోపు వైద్యులు పరుగున వచ్చారని తెలిపారు. వారి సూచన మేరకు తాను పదే పదే అక్కా.. అక్కా అని అరవగా, నెమ్మదిగా కళ్లు తెరిచినట్టు తెరచి చివరకు మూత పడిందన్నారు. అదే సమయలో తాను çస్పృహ తప్పానని వివరించారు. అక్క కారు ముందు సీట్లో, తాను వెనుక కూర్చుని ఇంటికి వెళ్తామన్న నమ్మకం, ఆశతో ఉన్నామని, అయితే, ఆమె మరణించడం తనకు తీవ్ర మనో వేదనను మిగిల్చిందని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు