శశికళ భర్త కన్నుమూత

21 Mar, 2018 01:20 IST|Sakshi
భర్త నటరాజన్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పెరోల్‌ కోరిన శశికళ

నేడు అంత్యక్రియలు

శశికళకు 15 రోజుల పెరోల్‌

సాక్షి, చెన్నై: తమిళ ప్రజల అమ్మ జయలలితకు నెచ్చెలి, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి శశికళ భర్త నటరాజన్‌(75) మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. పుదియ పార్వై పత్రిక సంపాదకుడు అయిన నటరాజన్‌ గత ఏడాది తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. అనేక చికిత్సల అనంతరం ఆయన కోలుకు న్నట్టు కుటుంబీకులు భావించారు. నుంగం బాక్కం మహాలింగపురంలోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

అయితే, ఆయన గతవారం గుండెపోటుకు గురయ్యారు. చెన్నై శివారులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున 1.30 గంటలకు ఆయన కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని పోరూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ఎంబామింగ్‌ చేశారు. అనంతరం చెన్నై బీసెంట్‌ నగర్‌లోని నివాసంలో మధ్యాహ్నం వరకు ఉంచారు.

అనంతరం తంజావూరు జిల్లాలోని నటరాజన్‌ స్వగ్రామం విలార్‌కు తరలించారు. బుధవారం అంత్యక్రియలు జరగనున్నాయి. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్, ఎండీఎంకే నేత వైగో, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, కాంగ్రెస్‌ శాసనసభా పక్ష నేత కేఆర్‌ రామస్వామి తదితరులు నటరాజన్‌ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

శశికళకు పెరోల్‌ మంజూరు
నటరాజన్‌ మరణంతో బెంగళూరు జైల్లో ఉన్న శశికళకు 15 రోజుల పెరోల్‌ మంజూరైంది. ఆమెను రోడ్డుమార్గంలో తంజావూరుకు తీసు కెళ్లేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు