జయలలిత పేరుతో అన్నాడీఎంకే!

12 Dec, 2016 14:32 IST|Sakshi
జయలలిత పేరుతో అన్నాడీఎంకే!

జయ అన్న కుమార్తె దీప అధ్యక్షురాలు.. సుప్రీం న్యాయవాది పేరున ఆడియో

సాక్షి ప్రతినిధి, చెన్నై:  అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న శశికళను వ్యతిరేకిస్తూ ‘జే అన్నాడీఎంకే’ పేరుతో కొత్త పార్టీ ప్రారంభిస్తానని అన్నాడీఎంకే కేసులను సుప్రీంకోర్టులో వాదించే న్యాయవాది కృష్ణమూర్తి ప్రకటించినట్లుగా ఒక ఆడియో తమిళనాడులో హల్‌చల్‌ చేస్తోంది. జయలలిత మరణించిన తరువాత అన్నాడీఎంకేను తమ చెప్పుచేతల్లోకి తీసుకునేందుకు శశికళ, సీఎం పన్నీర్‌సెల్వం, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై, మంత్రి ఎడపాడి పళనిస్వామి పోటీపడుతున్నారు.

ఈ నేపథ్యంలో అమ్మకు వీరాభిమాని అయిన సుప్రీంకోర్టు న్యాయవాది కృష్ణమూర్తి పేరున సామాజిక మాధ్యమాల్లో ఒక ఆడియో విడుదలైంది. అందులో... పార్టీలో శశికళ పెత్తనానికి నిరసనగా ’జే అన్నాడీఎంకే’ అనే పార్టీని స్థాపించబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాను స్థాపించబోయే పార్టీకి జయలలిత అన్నకుమార్తె దీపను అధ్యక్షురాలిగా నియమిస్తానని ఆయన పేర్కొన్నారు.

ఈ ఆడియోపై శశికళ మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణమూర్తిని అడ్డుకుని, అన్నాడీఎంకేతో ఎటువంటి సంబంధం లేదని ప్రకటన చేయాలని ఆయనపై ఒత్తిడి తెచ్చారు. తనను చంపుతామని శశికళ మద్దతుదారులు బెదిరించారని వాపోయారు. ఆయనను బెదిరించిన వీడియో కూడా సోషల్‌ మీడియాకు ఎక్కింది.