శానిటరీ ప్యాడ్స్‌.. కేంద్ర మంత్రిపై సెటైర్ల వర్షం

23 May, 2018 17:00 IST|Sakshi

ఢిల్లీ: అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించే మంత్రులు.. సంబంధిత ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం రివాజే. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కూడా అదే పనిచేశారు. కానీ అనూహ్యంగా విమర్శలు, సెటైర్లు ఎదుర్కోవల్సి వచ్చింది. విషయంలోకి వెళితే.. మొన్న మే 20న మంత్రిగారు ఉత్తరప్రదేశ్‌లోని గౌతంబుద్ధనగర్‌ జిల్లా ధనౌరికలాన్‌ గ్రామంలో పర్యటించారు. డిజిగావ్‌ పథకంలో భాగంగా అక్కడ వైఫై సేవలను ప్రారంభించారు. పనిలోపనిగా అక్కడి మహిళల ఆధ్వర్యంలో నడుస్తోన్న శానిటరీ ప్యాడ్స్‌ తయారీ కేంద్రాన్ని సదర్శించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోకు ‘‘ఈ మహిళలను కలుసుకోవడం సంతోషంగా ఉంది. శానిటరీ ప్యాడ్ల తయారీతో వీరికి జీవనోపాధి లభించడమేకాదు, స్త్రీస్వాభిమానాన్ని కూడా నిలబెడుతున్నారు’’ని కామెంట్‌ను జతచేసి ట్వీట్‌ చేశారు మంత్రిగారు.

కాగా, సదరు ఫొటోలో శానిటరీ ప్యాడ్లు తయారుచేసే మహిళల్లో ఒక్కరు కూడా లేకపోవడాన్ని నెటిజన్లు తప్పుపట్టారు. ‘ఏంటి సార్‌.. మహిళల కష్టాన్ని మగవాళ్లు క్యాష్‌ చేసుకుంటున్నారా?’, ‘శానిటరీ ప్యాడ్లు మగవారికా, ఆడవారికా?’, ‘ఫొటోలో ఏదో తేడా ఉందే!’,.. తరహా కామెంట్లు కుప్పలుతెప్పలుగా వచ్చిపడ్డాయి. కొన్ని గంటలకుగానీ పొరపాటును గ్రహించిన మంత్రివర్యులు.. ఆ మహిళలతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్‌చేశారు.

మరిన్ని వార్తలు