అమ్మ 'ఆకుపచ్చ' సాక్షిగా ప్రమాణం

23 May, 2015 15:26 IST|Sakshi

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత్రి జయలలితకు జ్యోతిష్యం అంటే అపార నమ్మకం. ముఖ్యమైన పనులు చేసేటపుడు తప్పకుండా జ్యోతిష్యుడి సలహా తీసుకుంటారు. సమయం, వారం,  ధరించే దుస్తులు, రంగు వంటి విషయాల్లో జయలలితకు సెంటిమెంట్లు ఎక్కువ. జయకు సన్నిహిత వర్గాలు ఈ విషయాలు వెల్లడించారు.

67 ఏళ్ల జయలలిత శనివారం ఐదోసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.  ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె  ఆకుపచ్చని చీర ధరించి వచ్చారు. ప్రమాణం చేశాక ఆకుపచ్చ రంగు పెన్నుతో సంతకం చేశారు. జయ చేతి వేలిపై ఆకుపచ్చ రంగు ఉంగరం ధగధగలాడి పోయింది. మొత్తానికి జయ ఆకుపచ్చని రంగుతో మెరిసిపోయారు.

ప్రమాణ స్వీకార వేదికను కూడా ఆకుపచ్చ రంగుతో అలంకరించారు. మరో విశేషమేంటంటే జయ ప్రమాణ స్వీకారం ముహూర్తం రోజును శనివారం ఎంచుకున్నారు. శనివారం శుభదినమని, సుస్థిరత చేకూరస్తుందని జయ విశ్వాసం.

ఇక టైమ్ కూడా జయ కచ్చితంగా పాటించారు. ఈ రోజు ఉదయం 10:37 గంటలకు ఆమె తన నివాసం పోయెస్ గార్డెన్ నుంచి బయల్దేరారు. ప్రమాణ స్వీకార వేదిక మద్రాస్ యూనివర్సిటీ సెంటనరీ ఆడిటోరియంకు సరిగ్గా 11 గంటలకు వచ్చారు. అరగంటలోపే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ముగించారు.  జయలలితతో ప్రమాణం చేయించిన గవర్నర్ రోశయ్య.. అనంతరం మంత్రులందరి చేత సామూహిక ప్రమాణం చేయించారు.

మరిన్ని వార్తలు