కశ్మీర్‌లో పర్యాటకులపై ఆంక్షల ఎత్తివేత

8 Oct, 2019 15:50 IST|Sakshi

శ్రీనగర్‌: పర్యాటకులపై విధించిన ఆంక్షలను జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం ఎత్తివేసింది. ఉగ్రవాద ప్రమాద నేపథ్యంలో పర్యాటకులంతా కశ్మీర్‌ నుంచి తక్షణమే వెళ్లిపోవాలంటూ ఆగస్ట్‌ 2న జారీ చేసిన హెచ్చరికను ఎత్తివేస్తున్నట్లు గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ ప్రకటించారు. ఇది అక్టోబర్‌ 10 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ ఆగస్ట్‌ 5న కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి మూడు రోజుల ముందు ఈ ఆంక్షలను విధించారు. అక్టోబర్‌ 24న జరగాల్సిన బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఎన్నికలకు సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు వీలుగా జైళ్లలో ఉన్న ఆయా పార్టీల నేతలను కలుసుకునేందుకు ఇతర నేతలకు అనుమతినిస్తున్నట్లు కూడా గవర్నర్‌ ప్రకటించారు.

ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో వరుసగా 65వ రోజు కశ్మీర్‌లోయలో జనజీవనం స్తంభించింది. మార్కెట్లు, ఇతర దుకాణాలు మూసివున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థకు చెందిన వాహనాలు ఇంకా రోడ్డెక్కలేదు. ప్రైవేటు వాహనాలు, టాక్సీలు, ఆటోలు మాత్రమే తిరుగుతున్నాయి. కశ్మీర్‌లో లాండ్‌లైన్‌ టెలిఫోన్‌ సేవలను పునరుద్ధరించారు. చాలా ప్రాంతాల్లో ఇంకా సెల్‌ఫోన్‌ సర్వీసులు అందుబాటులోకి రాలేదు. కాగా, మాజీ సీఎంలు, ఎన్‌సీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా తదితర ప్రధాన పార్టీల నేతలను గృహ నిర్బంధం కొనసాగుతోంది. (చదవండి: కశ్మీర్‌ ప్రగతి ప్రస్థానం షురూ)

మరిన్ని వార్తలు