‘రీలాక్‌ ఢిల్లీ’ వార్తలపై స్పందించిన సత్యేంద్ర జైన్‌

12 Jun, 2020 13:09 IST|Sakshi
ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర ప్రసాద్‌ జైన్

న్యూఢిల్లీ: కరోనా కేసులు పెరుగుతుండటంతో దేశరాజధానిలో లాక్‌డౌన్‌ పొడగిస్తారంటూ ప్రచారం అవుతున్న వార్తలపై ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర ప్రసాద్‌ జైన్‌ స్పందించారు. లాక్‌డౌన్‌ పొగించేది లేదని స్పష్టం చేశారు. ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్యేంద్ర జైన్‌ మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం ఢిల్లీలో లాక్‌డౌన్‌ను పొడగించ‌బోతుంది అంటూ సోషల్‌ మీడియాలో వస్తోన్న వార్తలు నిజం కాదు. లాక్‌డౌన్‌ను పొడగించే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ప్రజలు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అన్నారు. రెండు రోజులుగా సోషల్‌మీడియాలో ఢిల్లీ, తమిళనాడులో జూన్‌ 15 నుంచి జూలై 31 వరకు లాక్‌డౌన్‌ పొడగిస్తారనే వార్తలు ప్రచారం అయ్యాయి. ‘రీలాక్‌ ఢిల్లీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ తెగ ట్రెండ్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో సత్యేంద్ర జైన్‌ ఈ వార్తలపై స్పందించారు.(మ‌రోసారి సంపూర్ణ లాక్‌డౌన్‌: నిజ‌మేనా?)

ఇదిలా ఉండగా ఢిల్లీలో 2,098 కరోనా మరణాలు సంభవించాయన్న మునిసిపల్ కార్పొరేషన్ వ్యాఖ్యలను సత్యేంద్ర జైన్‌ కొట్టిపారేశారు. ‘మున్సిపల్‌ అధికారులు చెబుతున​ మాట వాస్తవమే అయితే ఆ వివరాలను మాకు ఎందుకు పంపించడం లేదు. మృతుల పేర్లు, వయస్సు వంటి అన్ని వివరాలు అవసరం. ఆ జాబితాను పంపించండి’ అన్నారు. ఢిల్లీలో ఇప్పటి వరకు 35,000 కరోనా కేసులు నమోదు కాగా.. 1,085 మరణాలు సంభవించాయి. మహారాష్ట్ర, తమిళనాడు తరువాత ఢిల్లీ దేశంలో కరోనా కేసుల సంఖ్యలో మూడవ స్థానంలో ఉంది. జూలై 31 నాటికి రాజధానిలో 5.5 లక్షల కరోనా కేసులు ఉంటాయని కేజ్రీవాల్‌ ప్రభుత్వం అంచనా వేసింది. 

మరిన్ని వార్తలు