10,400 అడుగుల ఎత్తులో ఎస్బీఐ శాఖ

14 Sep, 2019 20:17 IST|Sakshi

లధాఖ్‌: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) శనివారం తన శాఖను లధాఖ్‌లోని 10వేల 400 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసింది. లధాఖ్‌ను ఇటీవల కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన సంగతి తెలిసిందే. సముద్ర మట్టానికి 10వేల400 అడుగుల ఎత్తులో ఉన్న లధాఖ్‌ నుబ్రా వ్యాలీలోని దిక్సిత్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచ్‌ను ఎస్‌బీఐ చైర్మన్‌ రజినీష్‌ కుమార్‌ ప్రారంభించారు.

నుబ్రా వ్యాలీ లోయ ప్రాంతం. ఇక్కడ ఆరువేల మంది జనాభా మాత్రమే ఉంటారు. సుదూర ప్రాంతంగా ఉన్న ఇక్కడి ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలను అందించి.. ఆర్థికంగా పరిపుష్టి కలిగించే ఉద్దేశంతో ఎస్‌బీఐ తన శాఖను ఏర్పాటు చేసింది. భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లోని లెహ్‌లోని తుర్‌తుక్‌ గ్రామానికి 80 కిలోమీటర్ల దూరంలో ఈ బ్యాంక్‌ ఏర్పాటయింది. సియాచిన్‌ సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. మిగతా బ్యాంకులు ఊహించడానికి కూడా శక్యం కాని ప్రదేశాల్లో ఎస్బీఐ తన శాఖలను విస్తరించిందని, సుదూర కొండప్రాంతాల్లోని వారికి కూడా మొక్కవోని సంకల్పంతో ఎస్బీఐ తన సేవలను అందిస్తోందని ఈ సందర్బంగా బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వార్తలు