ఏడువేల కోట్ల రుణానికి.. 150 కోట్ల ఆస్తా?

17 Mar, 2016 13:29 IST|Sakshi
ఏడువేల కోట్ల రుణానికి.. 150 కోట్ల ఆస్తా?

ముంబై: భారీగా అప్పులు ఎగ్గొట్టి, ప్రస్తుతం పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్‌మాల్యా ఆస్తులను వేలానికి బ్యాంకులు సిద్ధమయ్యాయి. బ్యాంకులకు విజయ్‌మాల్యా రూ. 7వేల కోట్ల వరకు ఎగనామం పెట్టారు. ఈ క్రమంలో ఆయన నుంచి ఎగ్గొట్టిన రుణాలను రాబట్టుకునేందుకు బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ముంబైలోని మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ హౌస్‌ను గురువారం ఈ-వేలం వేయనున్నారు. అంధేరిలోని 2,401.70 చదరపు మీటర్లు విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాపర్టీకి రూ. 150 కోట్లకు మించి ధర పలికే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో రూ. ఏడువేల కోట్ల అప్పులకు ఈ 150 కోట్ల ఆస్తి ఏ మూలకు సరిపోతుందనే వాదన వినిపిస్తోంది.

ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం గురువారం ఈ కింగ్‌ఫిషర్‌ హౌస్‌ను ఆన్‌లైన్‌లో ఈ వేలం వేయనుంది. ఈ వేలంలో పాల్గొనేవాళ్లు రూ. 5 లక్షలు చెల్లించి, రూ. 15 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. విజయ్‌మాల్యాకు చెందిన కింగ్‌ ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థ బ్యాంకుల నుంచి రూ. 6,963 కోట్లు రుణాలు తీసుకొని.. ఎగ్గొట్టింది. ప్రస్తుతం కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ దివాళాతీసి మూతపడటంతో గత ఏడాది దానికి చెందిన ఈ భవనాన్ని ఎస్‌బీఐ స్వాధీనం చేసుకుంది. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకుగాను కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌తోపాటు విజయ్‌మాల్యా, ఆయనకు చెందిన యునైటెడ్ బ్రివరీస్‌ లిమిటెడ్‌ కూడా పూచికత్తు దారులుగా ఉన్నాయి.

బ్యాంకు రుణాల ఎగవేత వ్యవహారం తలకు చుట్టుకోవడంతో విజయ్‌మాల్యా దేశం నుంచి వెళ్లిపోయి ప్రస్తుతం లండన్‌లో ఉన్నట్టు భావిస్తున్నారు. గోవాలోని కింగ్‌ఫిషర్‌కు చెందిన విల్లాను కూడా బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయి. ఈ విల్లాకు రూ. 90 కోట్లు ధర పలుకుతుందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు