ఎస్బీఐ ఛార్జీల బాదుడు నేటినుంచే..

1 Apr, 2017 15:59 IST|Sakshi
ఎస్బీఐ ఛార్జీల బాదుడు నేటినుంచే..
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఛార్జీల బాదుడు కార్యక్రమం నేటినుంచే ప్రారంభించబోతుంది.. కనీస బ్యాలెన్స్ ఉంచని పక్షంలో జరిమానాలు,  నిర్దేశించిన మొత్తం కంటే నగదు లావాదేవీలు జరిపితే ఛార్జీల బాదుడు కార్యక్రమాన్ని 2017 ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించబోతున్నట్టు ఎస్బీఐ అంతకముందే హెచ్చరించిన సంగతి తెలిసిందే.  ఈ ఛార్జీల బాదుడుపై ఖాతాదారుల నుంచి పెద్ద  ఎత్తున నిరసనలు వచ్చిన్నప్పటికీ, ఎస్బీఐ మాత్రం వెనక్కి తగ్గలేదు.  ఎస్బీఐ అమలు చేయబోతున్న ఛార్జీల బాదుడుకు మొత్తం 31 కోట్ల డిపాజిట్ దారులు ప్రభావితం కానున్నారని తెలుస్తోంది. దీనిలో పెన్షనర్లు, విద్యార్థులు కూడా ఉన్నారు. ఎస్బీఐ తన ఐదు అనుబంధ బ్యాంకులు విలీనమవుతున్న తరుణంలో ఈ బాదుడు కార్యక్రమాన్ని బ్యాంకు ప్రారంభించబోతుంది.  
 
కనీస బ్యాలెన్స్ కింద మెట్రో బ్రాంచు ఖాతాదారులు తమ అకౌంట్లో కచ్చితంగా నెలకు రూ.5000 ఉంచుకోవాల్సిందే. లేదంటే 50 రూపాయల నుంచి 100 రూపాయల పెనాల్టీని భరించాల్సి ఉంటుంది. అలాగే అర్బన్, సెమీ-అర్బన్ బ్రాంచు ఖాతాదారులైతే కనీసం తమ బ్యాంకు బ్యాలెన్స్ రూ.3000, రూ.2000  ఉంచుకోవాల్సిందే. దీన్ని కనుక ఖాతాదారులు ఉల్లంఘిస్తే వీరికి కూడా రూ.20 నుంచి రూ.50 వరకు జరిమానా పడుతుందని బ్యాంకు అంతకమున్నుపే హెచ్చరించింది.   సమీక్షించిన ఛార్జీల అనంతరం  ఏటీఎం విత్ డ్రాయల్స్ పై కూడా 20 రూపాయల వరకు మోత మోగించనున్నారు.
 
ఎస్బీఐ ఏటీఎంలలో కూడా ఐదు సార్లు కంటే ఎక్కువ సార్లు డ్రా చేస్తే రూ.10 ఛార్జీని బ్యాంకు విధించనుంది.   రూ.25వేల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉండి సొంత ఏటీఎంలలో డ్రా చేసుకుంటే ఎలాంటి విత్ డ్రా ఛార్జీలుండవు. అలాగే ఇతర బ్యాంకు ఏటీఎంలలో డ్రా చేసుకుంటూ ఛార్జీల మోత నుంచి తప్పించుకోవాలంటే బ్యాంకు బ్యాలెన్స్ రూ.లక్షకు మించి ఉంచుకోవాలని బ్యాంకు సూచించింది. అయితే ఈ ఛార్జీల మోతను తమపై ఉన్న జన్ ధన్ అకౌంట్ల భారాన్ని తగ్గించుకోవడానికేనని ఎస్బీఐ సమర్ధించుకుంటోంది. అంతకముందు కూడా తాము ఈ పెనాల్టీలు వేశామని బ్యాంకు చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య చెబుతున్నారు. 2012లో వీటిని విత్ డ్రా చేసినట్టు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు