ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం వెనక్కి

2 Oct, 2019 02:33 IST|Sakshi

గత మార్గదర్శకాల ఉపసంహరణ

కేంద్రం రివ్యూ పిటిషన్‌పై విచారణ అనంతరం వెలువడిన తీర్పు

న్యూఢిల్లీ: షెడ్యూల్‌ కులాలు, తెగల (ఎస్సీ, ఎస్టీ) వేధింపుల నిరోధక చట్టం నిబంధనలను సడలిస్తూ 2018లో ఇచి్చన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ఉపసంహరించుకుంది. ఎస్సీ, ఎస్టీ ప్రజలు సమాజంలో సమానత్వం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారని, అంటరానివారుగా, వేధింపులకు, సామాజిక బహిష్కరణలకు గురవుతున్నారని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2018లో ఇచి్చన మార్గదర్శకాలను సమీక్షించాలంటూ కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ‘ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదయ్యే తప్పుడు కేసులకు మానవ వైఫల్యమే తప్ప కుల వ్యవస్థ కారణం కాదు. న్యాయస్థానం ఈ విషయంలో సంపూర్ణ అధికారాలను ఉపయోగించ జాలదు. రాజ్యాంగం మేరకు ఈ మార్గదర్శకాలను అనుమతించలేము. వీటి కారణంగా సంబంధిత కేసుల విచారణ జాప్యం అవుతుంది.

అందుకే ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేసే ముందుగా ప్రాథమిక దర్యాప్తు జరపాలని, అరెస్టుకు సంబంధిత అధికారి అనుమతి తీసుకోవాలంటూ గత ఏడాది మార్చి 20వ తేదీన ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన మార్గదర్శకాలను ఉపసంహరించుకుంటున్నాం’అని తెలిపింది.‘ఒకవేళ నేరం నిర్ధారణ అయితే ఎఫ్‌ఐఆర్‌ తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ విషయంలో ప్రాథమిక విచారణ కూడా అవసరం లేదు’ అని స్పష్టం చేసింది. ఈ చట్టంలో ప్రాథమిక విచారణ జరపాలనే నిబంధనలు లేవని తెలిపింది.ఆర్టికల్ 15 ద్వారా రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కలి్పంచిందని, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా ఇంకా వారు సామాజికంగా వేధింపులు, వివక్షకు గురవుతున్నారని పేర్కొంది. కులరహిత సమాజ స్థాపనే అంతిమ లక్ష్యం. రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన అటువంటి పవిత్ర లక్ష్యం నెరవేరుతుందని ఆశిస్తున్నాం’అని తెలిపింది. మనుషులతో మలమూత్రాల్ని ఎత్తివేయిస్తున్న పరిస్థితులు, ఈ సందర్భంగా సంభవిస్తున్న మరణాలపైనా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.

ప్రపంచంలో మరెక్కడా కూడా మనుషులను గ్యాస్‌ చాంబర్లలోకి పంపి చంపడం లేదని వ్యాఖ్యానించింది. స్వాతంత్య్రం వచి్చన 70 ఏళ్ల తర్వాత కూడా వివక్షకు, అంటరానితనానికి గురవుతున్న ఎస్సీ, ఎస్టీలను ప్రభుత్వం రక్షించలేక పోయిందని కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌నుద్దేశించి వ్యాఖ్యానించింది. గత ఏడాది మార్చిలో ద్విసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పును సెప్టెంబర్‌ 18వ తేదీన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చట్టం దురి్వనియోగం అవుతున్నప్పుడు శాసనాలకు రాజ్యాంగానికి విరుద్ధంగా ఆదేశాలు జారీ చేయగలమా? కులం ప్రాతిపదికన ఏ వ్యక్తినయినా అనుమానించగలమా? సాధారణ పౌరుడు కూడా తప్పుడు కేసు పెట్టొచ్చు కదా’అని పేర్కొంది. సమానత్వ సాధనకు సంబంధించిన ఈ అంశంపై నిర్దిష్టమైన మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు కూడా ఆ సమయంలో తెలిపింది.

ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని దురి్వనియోగం చేస్తూ ప్రభుత్వ అధికారులను వేధిస్తున్నారంటూ అభిప్రాయపడిన సుప్రీంకోర్టు గత ఏడాది సంచలన మార్గదర్శకాలను జారీ చేసింది. వీటి ప్రకారం ప్రభుత్వ అధికారులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదయ్యే కేసుల్లో తక్షణమే అరెస్టులకు పూనుకోకుండా ఆరోపణల్లో వాస్తవాలను ముందుగా డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయించాలని పేర్కొంది. దీంతో ఈ చట్టాన్ని నీరుగార్చారంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టానికి సవరణలు చేపట్టింది. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్వులను సమీక్షించాలంటూ సుప్రీంలో పిటిషన్‌ వేసింది.

మరిన్ని వార్తలు