పాటియాల కోర్టుకు సుప్రీంకోర్టు లాయర్ల టీం!

17 Feb, 2016 15:51 IST|Sakshi
పాటియాల కోర్టుకు సుప్రీంకోర్టు లాయర్ల టీం!

న్యూఢిల్లీ: పాటియాలా హౌస్ కోర్టులో జేఎన్యూ విద్యార్థులపై నమోదైన దేశద్రోహం కేసు విచారణ సందర్భంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దడానికి సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. ఈ కేసు విచారణను పరిశీలనకు ఆరుగురు సీనియర్ సభ్యులతో కూడిన బృందాన్ని నియమిస్తూ జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అభయ్ కుమార్లతో కూడిన  ధర్మాసనం బుధవారం సంచలన నిర్ణయం తీసుకుంది.

పాటియాల హౌజ్ కోర్టులో కేసు విచారణకు అనువైన పరిస్థితులు లేవని, విచారణ జరుగుతున్న కోర్టు రూం బయట  ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో విచారణకు హాజరైన వారిలో భయాందోళన నెలకొన్నదని సీనియర్ కౌన్సిల్ ఇంద్రా జైసింగ్ కోర్టుకు తెలిపారు. విచారణ ప్రాంగణంలో ఓ జర్నలిస్టుపై చేయి చేసుకున్న విషయం మీడియాలో ప్రసారమైన విషయాన్ని మరో సీనియర్ కౌన్సిల్ ప్రశాంత్ భూషణ్ కోర్టుకు సమర్పించారు.

ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులను సమీక్షించడానికి సీనియర్ లాయర్ల బృందాన్ని సుప్రీంకోర్టు నియమించింది. ఈ బృందంలో కపిల్ సిబాల్, రాజీవ్ దావన్, దుశ్యంత్ దేవ్, అజిత్ సిన్హా, ఏజీఎన్ రావు, హరిన్ రావల్ ఉన్నారు. పరిస్థితులు అదుపులోకి రాకపోతే విచారణ జరిగే ప్రదేశాన్ని మార్చనున్నట్లు కోర్టు తెలిపింది.

>
మరిన్ని వార్తలు