‘జిల్లా స్ధాయిలో పోక్సో కోర్టుల ఏర్పాటు’

25 Jul, 2019 14:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చిన్నారులపై లైంగిక దాడుల కేసుల సత్వర విచారణకు పోక్సో చట్టం కింద ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సర్వోన్నత న్యాయస్ధానం గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వందకు పైగా పెండింగ్‌ కేసులున్న ప్రతి జిల్లాలో ఈ తరహా కోర్టును ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కోర్టులు పనిచేయడం‍ ప్రారంభించేందుకు 60 రోజుల డెడ్‌లైన్‌ను నిర్దేశించింది. ఇలాంటి కోర్టుల ఏర్పాటుకు కోసం కేంద్రం తగినన్ని నిధులను కేటాయించాలని సూచించింది.

న్యాయమూర్తులు, సిబ్బంది, ప్రత్యేక ప్రాసిక్యూటర్ల నియామకం చేపట్టాలని కోరింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను సెప్టెంబర్‌ 26కు వాయిదా వేసింది. చిన్నారులపై లైంగిక దాడికి సంబంధించి దాదాపు 1.5 లక్షలకు పైగా కేసుల విచారణకు ప్రస్తుతం కేవలం 670 పోక్సో కోర్టులే ఉన్నాయని అమికస్‌ క్యూరీ గిరి, సుప్రీం కోర్టు రిజిస్ర్టీ నివేదిక సమర్పించిన మీదట కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుతం ఒక న్యాయమూర్తి రోజుకు సగటున 224 కేసులను పర్యవేక్షిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఏడాదిలోపు పోక్సో కేసులు పరిష్కారం కావాలంటే ప్రస్తుతం కోర్టుల్లో ఉన్న సిబ్బందికి మూడు రెట్లు అదనపు సిబ్బంది అవసరమని పేర్కొంది. కాగా చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన వారికి మరణ శిక్షను ఖరారు చేస్తూ రాజ్యసభ బుధవారం పోక్సో చట్ట సవరణ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు