సుప్రీం కీలక ఆదేశాలు; ప్రత్యేక చట్టం రూపొందించాల్సిందే!

20 Nov, 2019 15:04 IST|Sakshi

న్యూఢిల్లీ: శబరిమల ఆలయ నిర్వహణ విషయమై ప్రత్యేక చట్టం రూపొందించాలని సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి పూర్తి విధివిధానాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. శబరిమల ఆలయ నిర్వహణలో తమ హక్కులు పరిరక్షించాలంటూ పండలం రాజ కుటుంబం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేరళలోని ఆలయ పాలకమండలి చట్టాల్లో మార్పులు చేసేందుకు ప్రభుత్వం ఉపక్రమించిన నేపథ్యంలో వారు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో బుధవారం ఈ పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ అయిన క్రమంలో... ఆలయ సలహా మండలిలో మహిళలకు పదవులు కేటాయించే విషయంలో నిర్ణయమెలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మత ఆచార వ్యవహారాల గురించిన వివాదం విచారణలో ఉండగానే.. మహిళా ప్యానెల్(మహిళా కోటా ప్రకారం మూడింట ఒక వంతు పదవులు) ఎలా ఏర్పాటు చేశారో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇందుకు బదులుగా... ఆలయ పాలనలో మహిళలకు అవకాశం కల్పించే విషయంలో తాము ఉదారంగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో గతంలో తాము రూపొందించిన చట్ట ముసాయిదాను కోర్టుకు సమర్పించింది. అయితే ఈ ముసాయిదాను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం... ఇది సరిపోదని.. శబరిమల ఆలయ నిర్వహణ- పాలనకై ప్రత్యేక చట్టం రూపొందించాల్సిందేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జనవరి మూడో వారానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

ఇక కేరళలోని అయ్యప్ప ఆలయంలోకి రుతుక్రమ వయసు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు గతేడాది తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీర్పును నిరసిస్తూ హిందుత్వ సంఘాలు, సంఘ్‌పరివార్‌ ధర్నాకు దిగాయి. ఈ క్రమంలో తీర్పును పునః పరిశీలించాలని దాఖలైన రివ్యూ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం గురువారం సమీక్షించింది. ఇందులో భాగంగా ఈ అంశాన్ని ఏడుగురు సభ్యులున్న విస్తృత స్థాయి ధర్మాసనానికి అప్పగించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు