జడ్జీలుగా పదోన్నతిలో నిబంధనల సడలింపు

16 Feb, 2019 03:29 IST|Sakshi

13 మందికి పదోన్నతి కల్పిస్తూ కేంద్రానికి కొలీజియం సిఫారసు 

న్యూఢిల్లీ: జడ్జీలుగా పదోన్నతి కల్పించే విషయంలో కొన్ని కేటగిరీల్లో నిబంధనలను సుప్రీంకోర్టు కొలీజియం సడలించింది. వివిధ హోదాల్లో పనిచేస్తున్న 13 మందికి హైకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం కేంద్రానికి సిఫారసు చేసింది. వీరిలో అలహాబాద్‌ హైకోర్టుకు 12 మంది, కేరళ హైకోర్టుకు ఒకరు ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డేలతో కూడిన కొలీజియం ఈ నెల 12వ తేదీన తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం అత్యున్నత న్యాయస్థానం వెబ్‌సైట్‌లో ఉంచింది.

ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ అభ్యర్థులతోపాటు ప్రభుత్వ ప్లీడర్లుగా పనిచేస్తున్న వారి వృత్తిపరమైన ఆదాయం ఏడాదికి కనీసం రూ.7 లక్షలు ఉండాలన్న నిబంధనను కొలీజియం పక్కన పెట్టినట్లు అందులో సుప్రీంకోర్టు తెలిపింది. కేరళ హైకోర్టు జడ్జీగా లాయర్‌ పీవీ కున్హికృష్ణన్‌తోపాటు అలహాబాద్‌ హైకోర్టుకు జడ్జీలుగా 10 మంది లాయర్లు, ఒక జడ్జీని పదోన్నతిపై పంపాలని సిఫారసు చేసింది. ప్రభుత్వ ప్లీడర్లుగా పనిచేస్తున్న వారికి, ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ అభ్యర్థుల వృత్తిపర ఆదాయం ఏడాదికి కనీసం రూ.7లక్షలు ఉండాలన్న పరిమితి సహేతుకంగా లేనందున, దానిని పక్కనబెట్టినట్లు అందులో పేర్కొంది.

మరిన్ని వార్తలు