మహా తీర్పు : అసెంబ్లీలో బుధవారమే బలపరీక్ష

26 Nov, 2019 10:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీకి సర్వోన్నత న్యాయస్ధానంలో చుక్కెదురైంది. మహారాష్ట్ర వ్యవహారాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. దేవేంద్ర ఫడ్నవీస్‌ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఐదు గంటల లోగా బలనిరూపణ చేసుకోవాలని స్పష్టం చేసింది. బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరింది. బుధవారం సాయంత్రం ఐదు గంటలలోపు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలని వెంటనే ప్రొటెం స్పీకర్‌ను నియమించాలని ఆదేశించింది. రహస్య ఓటింగ్‌ నిర్వహించరాదని, బుధవారం బలపరీక్ష ఎదుర్కోవాలని ఫడ్నవీస్‌కు స్పష్టం చేసింది. జస్టిస్‌ ఎన్వీ రమణ తీర్పును చదివి వినిపించారు.

ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన పేర్కొన్నారు. జస్టీస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన సుప్రీం బెంచ్‌ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. మరోవైపు సుప్రీం నిర్ణయంతో ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌ శిబిరంలో ఉత్తేజం నెలకొంది. బలపరీక్ష జరిగే వరకూ తమ ఎమ్మెల్యేలు చేజారకుండా మూడు పార్టీలు చర్యలు చేపట్టగా, ఎన్సీపీ చీలిక వర్గ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో బలపరీక్షలో బయటపడాలని బీజేపీ యోచిస్తోంది. మహా తీర్పును కాంగ్రెస్‌ సహా విపక్షాలు స్వాగతించాయి. ఇది చరిత్రాత్మక తీర్పని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అభివర్ణించగా, ప్రజాస్వామ్య విజయమని శివసేన హర్షం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు