1984 అల్లర్లపై మరో సిట్‌

11 Jan, 2018 01:13 IST|Sakshi

మూసేసిన 186 కేసుల దర్యాప్తు పర్యవేక్షణ

హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వం

సుప్రీంకోర్టు ఆదేశాలు  

న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులను మరోసారి విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. నాటి అల్లర్లకు సంబం ధించిన 241 కేసుల్లో 186 కేసులను ఎలాంటి దర్యాప్తు జరపకుండానే మూసేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. తాజా దర్యాప్తును పర్యవేక్షించేందుకు మళ్లీ త్రిసభ్య ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌)ను  ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలోని ఆ సిట్‌ మూసేసిన 186 సిక్కు వ్యతిరేక కేసులను దర్యాప్తును పర్యవేక్షిస్తుందని బుధవారం స్పష్టం చేసింది. సిట్‌లో ఒక రిటైర్డు పోలీసు ఆఫీసర్‌(పదవీవిరమణ నాటికి డీఐజీ ర్యాంకుకు తగ్గని అధికారి), మరో పదవిలో ఉన్న పోలీసు అధికారి సభ్యులుగా ఉంటారంది. సిట్‌లో సభ్యులుగా నియమించేందుకు అర్హులైన వారిని  సిఫారసు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ కేసుల్లో దర్యాప్తు జరిగిన తీరును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది.

కేసు దర్యాప్తును పర్యవేక్షించేందుకు గతంలో ఏర్పాటు చేసిన సిట్‌ 241 కేసులను మూసేయాలని నిర్ణయించడంపై.. మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ జేఎం పంచల్, జస్టిస్‌ కేఎస్‌పీ రాధాకృష్ణన్‌లతో ఒక కమిటీని 2017 ఆగస్ట్‌లో సుప్రీంకోర్టు నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికను బుధవారం సుప్రీం ధర్మాసనం పరిశీలించింది. మూసేసిన 241 కేసుల్లో 186 కేసులను ఎలాంటి దర్యాప్తు లేకుండానే గతంలో ఏర్పాటు చేసిన సిట్‌ మూసేసిన వైనాన్ని ఆ కమిటీ గుర్తించి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. దానిపై స్పందించిన ధర్మాసనం తాజాగా మరో సిట్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.

ఈ సిట్‌ గతంలో మూసేసిన 186 కేసుల పునర్విచారణను మాత్రమే పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది. సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి దర్యాప్తు జరిపిన 250 కేసుల్లో 241 కేసులను పాత సిట్‌(1986 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి ప్రమోద్‌ అస్తానా నేతృత్వంలోని) మూసేయగా, మరో 9 కేసుల విచారణ కొనసాగుతోంది. ఆ తొమ్మిది కేసుల్లో రెండింటిని సీబీఐ విచారిస్తోంది. 1984లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కు మతస్తులు లక్ష్యంగా చోటుచేసుకున్న దారుణ ఊచకోతపై ఇప్పటికే పలు కమిషన్‌లు, కమిటీలు నివేదికలు సమర్పించిన విషయం తెలిసిందే.  

2,733 మంది ఊచకోత: 1984 నాటి ఇందిర హత్యానంతరం జరిగిన  సిక్కు వ్యతిరేక అల్లర్లలో 2,733 మంది సిక్కులు ఊచకోతకు గురైన సంగతి తెలిసిందే. ఈ అల్లర్లకు నేతృత్వం వహించారన్న ఆరోపణలతో కాంగ్రెస్‌ నేతలు జగదీశ్‌ టైట్లర్, సజ్జన్‌ కుమార్‌ తదితరులపై కేసులు నమోదయ్యాయి.

అయితే సాక్షులు సహకరించటం లేదంటూ, సరైన ఆధారాల్లేవంటూ ఈ ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు సహా పలువురిపై కేసులను సీబీఐ వెనక్కు తీసుకుంది. నాటి (2005 తర్వాత) కాంగ్రెస్‌ ప్రభుత్వం కావాలనే చాలా కేసుల్లో విచారణను అర్ధాంతరంగా ముగించిందని ఢిల్లీ సిఖ్‌ గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యుడు గుర్లాద్‌ సింగ్‌ కహ్లాన్‌ పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ సందర్భంగానే కోర్టు తాజాగా మరో సిట్‌ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.


33 ఏళ్ల విచారణ
1984, నవంబర్‌: అక్టోబర్‌ 31 నాటి ఇందిరా గాంధీ హత్యకు సిక్కులే కారణమంటూ ఢిల్లీ లో చెలరేగిన అల్లర్లు. గురుద్వారాలు, సిక్కు లు నివసించే ప్రాంతాలే లక్ష్యంగా దాడులు. ఒక్క ఢిల్లీలోనే 2,733 మంది ఊచకోత.
2000, మే: సిక్కు వ్యతిరేక ఘర్షణలపై విచారణకోసం జస్టిస్‌ జీటీ నానావతి కమిషన్‌ను ఏర్పాటుచేసిన వాజ్‌పేయి ప్రభుత్వం.
2005, ఆగస్టు 8: పార్లమెంటు ముందుకు నానావతి కమిషన్‌ నివేదిక.
ఆగస్టు 10: పార్లమెంటులో విపక్షాల ఆందోళన, విస్తృత చర్చ. ఈ అల్లర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నట్లు నాటి ప్రధాని మన్మోహన్‌ ప్రకటన.
నవంబర్‌ 5: కాంగ్రెస్‌ నేత జగదీశ్‌ టైట్లర్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ.
2007, అక్టోబర్‌ 28: టైట్లర్‌ పాత్ర రుజువు కానందున కేసు వెనక్కు తీసుకున్న సీబీఐ.  
డిసెంబర్‌ 18: సీబీఐ నివేదికను తిరస్కరించిన కోర్టు. కేసు పునర్విచారణకు ఆదేశం.
డిసెంబర్‌ 2008 నుంచి ఏప్రిల్‌ 2009: కేసుకు సంబంధించి సాకు‡్ష్యలను విచారించిన సీబీఐ. మరోసారి టైట్లర్‌పై కేసు వెనక్కు తీసుకున్నట్లు కోర్టుకు వినతి.
ఫిబ్రవరి, 2010: కాంగ్రెస్‌ నేత సజ్జన్‌ కుమార్‌ సహా ఏడుగురికి కోర్టు సమన్లు. సజ్జన్‌ కుమార్‌పై నాన్‌–బెయిలబుల్‌ వారెంట్‌ జారీ.
ఏప్రిల్‌ 2010: టైట్లర్‌పై కేసు కొట్టేయాలన్న సీబీఐ వినతిని అంగీకరించిన కోర్టు.
 జూలై 2010: కోర్టులో బాధితుల పిటిషన్‌. కేసు విచారణ సరిగా జరగటం లేదని, పునర్విచారణ జరపాలని వినతి. అంగీకరించిన కోర్టు. ఐపీఎస్‌ అధికారి ప్రమోద్‌ ఆస్తానా నేతృత్వంలో త్రిసభ్య సిట్‌ ఏర్పాటు.
ఏప్రిల్, 2013: కేసును తిరిగి ప్రారంభించాలని సీబీఐకి ఆదేశం.
ఏప్రిల్‌ 30: సజ్జన్‌కుమార్‌ను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు. 

మరిన్ని వార్తలు