చైల్డ్ పోర్నోగ్రఫీ నిషేధంపై రెండువారాల గడువు!

28 Mar, 2016 19:21 IST|Sakshi

న్యూఢిల్లీ: సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్న చైల్డ్ పోర్నోగ్రఫీని పూర్తిగా నిషేధించేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి మరింత గడువు ఇచ్చింది. అదేసమయంలో పోర్న్ వెబ్‌సైట్ల నిరోధానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంది. ఈ విషయంలో సూచనలు ఇచ్చేందుకు రెండు వారాల గడువు ఇవ్వాల్సిందిగా కేంద్రం న్యాయస్థానాన్ని కోరింది. అందుకు సమ్మతించిన సుప్రీంకోర్టు ఈ కేసులో విచారణను ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేసింది.

వరుసగా సెలవులు ఉండటంతో సంబంధిత ప్రభుత్వ విభాగాల మధ్య సమావేశం జరుగలేదని, కాబట్టి చైల్డ్ పోర్నోగ్రఫీ నిషేధంపై సూచనలు ఇచ్చేందుకు రెండు వారాల గడువు ఇవ్వాలని అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ సుప్రీంకోర్టును కోరారు. కాగా, ఈ వ్యవహారంలో పిటిషనర్ తరఫు న్యాయవాది విజయ్ పంజ్వానీ సుప్రీంకోర్టుకు సూచనలు సమర్పించారు. పోర్నోగ్రఫీ వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని, ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీని పూర్తిగా నిషేధించాలని కోరుతూ కమలేశ్ వాస్వనీ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ శివకీర్తి సింగ్ ధర్మాసనం వాదనలు వింటున్నది.

>
మరిన్ని వార్తలు