సీబీఐ వివాదం : సుప్రీం ముందుకు సీవీసీ నివేదిక

12 Nov, 2018 11:33 IST|Sakshi

సీవీసీ దర్యాప్తు నివేదికను పరిశీలించనున్న సుప్రీం కోర్టు..

సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) విచారణలో నిగ్గుతేలిన అంశాలపై సుప్రీం కోర్టు సోమవారం ఆరా తీయనుంది. ప్రాధమిక దర్యాప్తు నివేదికను నేడు సుప్రీం కోర్టు పరిశీలించనుంది. వర్మపై అవినీతి ఆరోపణల కేసులో రెండు వారాల్లోగా ప్రాధమిక దర్యాప్తు పూర్తిచేయాలని సుప్రీం కోర్టు సీవీసీకి రెండు వారాల గడువిచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్ధానా అలోక్‌ వర్మపై చేసిన అవినీతి ఆరోపణల కేసుకు సంబంధించి సీవీసీ చీఫ్‌ కేవీ చౌదరి నేతృత్వంలోని కమిటీ ముందు వర్మ హాజరైన నేపథ్యంలో సుప్రీం విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది. తనపై రాకేష్‌ ఆస్ధానా చేసిన ఆరోపణలను పాయింట్ల వారీగా అలోక్‌ వర్మ తోసిపుచ్చినట్టు తెలుస్తోంది.

కాగా ప్రధాన​న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌, జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌తో కూడిన సుప్రీం బెంచ్‌ అలోక్‌ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తోంది. కాగా, వర్మపై అవినీతి ఆరోపణలకు సంబంధించిన విచారణకు మాజీ న్యాయమూర్తి ఏకే పట్నాయక్‌ను సుప్రీం కోర్టు పర్యవేక్షకుడిగా నియమించింది.

వర్మపై అవినీతి ఆరోపణలపై రెండు వారాల్లోగా విచారణ పూర్తిచేయాలని ఆదేశించిన సుప్రీం ఆయన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం, సీవీసీలకు గత నెల 26న నోటీసులు జారీ చేసింది. కాగా తనను ప్రభుత్వం సెలవుపై పంపడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు