మోదీకి సిట్‌ క్లీన్‌చిట్‌ : సుప్రీం ముందుకు పిటిషన్‌

13 Nov, 2018 14:34 IST|Sakshi
ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : 2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోదీ, ఇతరులకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ మాజీ కాంగ్రెస్‌ ఎంపీ ఇషాన్‌ జఫ్రీ భార్య జకియా జఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. ఈనెల 19న ఈ కేసును విచారణకు చేపడతామని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. గుజరాత్‌ అల్లర్ల కేసులో ప్రధాని సహా పలువురికి సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిసన్‌ను గత ఏడాది గుజరాత్‌ హైకోర్టు కొట్టివేస్తూ తదుపరి విచారణ కోసం ఎగువ కోర్టులను ఆశ్రయించాలని సూచించింది. 2002, ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని గుల్‌బర్గ్‌ సొసైటీలో అల్లరి మూకలు జరిపిన దాడిలో కాంగ్రెస​ ఎంపీ ఇషాన్‌ జఫ్రీ సహా 68 మరణించారు.

మార్చి 2008న సుప్రీం కోర్టు నియమించిన సిట్‌ జఫ్రీ ఆరోపణలపై విచారణ చేపట్టింది. 2010లో అప్పటి గుజరాత్‌ సీఎంగా ఉన్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీని సిట్‌ దాదాపు తొమ్మిది గంటలు పైగా ప్రశ్నించింది. అనంతరం ఈ కేసులోని అన్ని ఆరోపణల నుంచి ప్రధాని మోదీని సిట్‌ తప్పించింది. ప్రధానికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని కేసును మూసివేస్తూ సిట్‌ తన నివేదికలో స్పష్టం చేసింది.

ప్రధాని మోదీకి సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌తో కలిసి 2012 ఫిబ్రవరి 9న జఫ్రీ మెట్రపాలిటన్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే కోర్టు సిట్‌ ఉత్తర్వులను సమర్ధించడంతో జఫ్రీ, తీస్తా సెతల్వాద్‌ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. గుజరాత్‌ హైకోర్టులోనూ చుక్కెదురవడంతో సిట్‌ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు.

మరిన్ని వార్తలు