మరుసటి వారం వీవీప్యాట్‌లపై రివ్యూ పిటిషన్‌ విచారణ

3 May, 2019 13:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కనీసం 50 శాతం ఈవీఎంల్లో పోలయిన ఓట్లను వీవీప్యాట్‌ స్లిప్పులతో సరిపోల్చాలని 21 రాజకీయ పార్టీలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు వచ్చే వారం విచారణకు చేపట్టనుంది.  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన బెంచ్‌ ఈ పిటిషన్‌ను తక్షణం విచారించాలని విపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌ కోరింది. కాగా విపక్షాల అప్పీల్‌పై గతంలో అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఒక ఈవీఎంకు బదులుగా ఐదు ఈవీఎంల్లో పోలయిన ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలని సుప్రీం కోర్టు ఏప్రిల్‌ 8న ఈసీని ఆదేశించింది.

ఎన్నికల ప్రక్రియలో కచ్చితత్వాన్ని పెంపొందించే క్రమంలో ఈ చర్యలు చేపట్టాలని కోరింది. సర్వోన్నత న్యాయస్ధానం ఉత్తర్వులపై ఏప్రిల్‌ 24న 21 రాజకీయ పార్టీలు తిరిగి రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాయి. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం కనీసం 50 శాతం ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్పులను సరిపోల్చేలా లెక్కించాలని ఆయా పార్టీలు పట్టుబట్టాయి. ఇక కాంగ్రెస్‌, ఎన్సీపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, ఆప్‌, సీపీఐ, సీపీఎం, టీడీపీ సహా 21 పార్టీలు రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేశాయి.

మరిన్ని వార్తలు