వసుంధర రాజెకు సుప్రీం నోటీసులు

2 Nov, 2018 19:15 IST|Sakshi
రాజస్ధాన్‌ సీఎం వసుంధర రాజె సింధియా (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ భూమిని ఎన్‌హెచ్‌ఏఐకి విక్రయించి రూ 1.97 కోట్లు స్వీకరించారనే ఆరోపణలపై  రాజస్ధాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజె ఆమె కుమారుడు దుష్యంత్‌ సింగ్‌లకు సుప్రీం కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ ఉదంతంలో వారిద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం నోటీసులు జారీ చేసింది. 2010లో జాతీయ రహదారి విస్తరణ కోసం ప్రభుత్వ భూమిని వారు ఎన్‌హెచ్‌ఏఐకి విక్రయించే సమయంలో రూ 1.97 కోట్ల పరిహారం పొందారని ఆరోపణలున్నాయి.

భూమిని విక్రయించే సమయంలో వసుంధరా రాజె  అధికారంలో లేరు. ఆ సమయంలో విపక్ష నేతగా ఉన్న వసుంధర రాజె, ఆమె కుమారుడు కలిసి ధోల్‌పూర్‌లోని ధోల్‌పూర్‌ ప్యాలెస్‌ వద్ద 567 చదరపు మీటర్ల భూమిని అక్రమంగా సొంతం చేసకుని దాన్ని ఎన్‌హెచ్‌ఏఐకి విక్రయించడంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని పిటిషన్‌ ఆరోపించింది. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ నేతృత్వంలోని బెంచ్‌ రాజె, ఆమె కుమారుడి నుంచి వివరణ కోరింది. తన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చడాన్ని సవాల్‌ చేస్తూ రాజస్ధాన్‌కు చెందిన న్యాయవాది సృజన శ్రేష్ట సుప్రీం కోర్టులో అప్పీల్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు