కేంద్రానికి ఎదురుదెబ్బ.. సీబీఐ కేసులో కీలక తీర్పు

8 Jan, 2019 11:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సీబీఐ కేసులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. అలోక్‌ వర్మను బలవంతంగా సెలవుపై పంపలేరని, ఆయననే సీబీఐ డైరెక్టర్‌గా తిరిగి నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ వర్సెస్‌ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తీర్పును వెలువరిస్తూ.. కేంద్ర ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుపట్టింది.

సీబీఐ అనేది స్వయం ప్రతిపత్తిగల వ్యవస్థ అని, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నందున రాజకీయ పక్షాలు జోక్యం చేసుకోకూడదని న్యాయస్థానం తీర్పును వెలువరించింది. అలోక్‌ వర్మను సెలవులపై పంపిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొటివేస్తూ... సీబీఐ డైరెక్టర్‌పై చర్యలు తీసుకునేముందు అపాయింట్‌మెంట్‌ కమిటీని సంప్రదించి ఉండాల్సిందని పేర్కొంది. అలోక్‌ వర్మపై ఆరోపణలు ఉన్నందున హైపవర్‌ కమిటీ విచారణ పూర్తి అయ్యే వరకు ఆయన ఎలాంటి విధాన పరమైన నిర్ణయాలు తీసుకోకూడదని సుప్రీం పేర్కొంది.

కమిటీ విచారణ పూర్తి అయ్యి నివేదికను అందించిన తరువాతనే నిర్ణయాలు తీసుకుంటారని ధర్మాసనం తీర్పులో పొందుపరిచింది. అలోక్‌వర్మ, స్పెషల్‌ డైరెక్టర్‌ ఆస్థానాలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో కేంద్రం వారిని అక్టోబర్‌ 23న సెలవుపై పంపంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అలోక్‌ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సుప్రీం తీర్పు మోదీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు