ప్రాంతీయ భాషల్లో ‘నీట్’ను పరిశీలిస్తాం: సుప్రీం

11 May, 2016 01:24 IST|Sakshi
ప్రాంతీయ భాషల్లో ‘నీట్’ను పరిశీలిస్తాం: సుప్రీం

తెలుగు సహా ఆరు ప్రాంతీయ భాషల్లో నిర్వహణకు అనుమతి కోరిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్యా కోర్సులైన ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ‘నీట్’ రాయటం తప్పనిసరి అని ఆదేశించిన సుప్రీంకోర్టు.. ఈ ఏడాది ఈ పరీక్షను తెలుగు సహా ఆరు ప్రాంతీయ భాషల్లో నిర్వహించేందుకు అనుమతించే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. సుప్రీం బెంచ్ సోమవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రాంతీయ భాషల్లో నీట్ నిర్వహించే అంశం ప్రస్తావన లేదని.. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్ మంగళవారం జస్టిస్ అనిల్ ఆర్ దవే నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు.

నీట్‌ను ఇంగ్లిష్, హిందీల్లో నిర్వహించడం వల్ల ప్రాంతీయ భాష విద్యార్థులు, గ్రామీణ విద్యార్థులు నష్టపోతారని, ఈ విద్యా సంవత్సరానికి తెలుగు, తమిళం, మరాఠీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీల్లో నిర్వహించేలా మినహాయింపు ఇవ్వాలని కోరారు. ప్రాంతీయ భాషల్లో నీట్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని సీబీఎస్‌ఈ న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలాగే ఈ ఏడాది నీట్ నిర్వహణ నుంచి రాష్ట్రాలను మినహాయించాలని గుజరాత్  న్యాయవాది తుషార్ మెహతా మరోసారి బెంచ్‌కునివేదించారు. ఈ అంశాలపై మరో బెంచ్ ఏర్పాటు చేసే విషయమై ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందని బెంచ్  పేర్కొంది.
 
మెడికల్ సీట్ల భర్తీకి ‘గుజ్‌సెట్’ నిర్వహణ
అహ్మదాబాద్: వైద్య విద్య ప్రవేశాలను ‘నీట్’ ద్వారా మాత్రమే కల్పించాలన్న సుప్రీం ఆదేశాలను గుజరాత్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ముందుగా నిర్ణయించిన ప్రకారం వైద్య సీట్ల భర్తీకి ‘గుజరాత్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్’(గుజ్‌సెట్)ను మంగళవారం నిర్వహించింది. 68 వేల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ‘మెడికల్, డెంటల్, ఫిజియోథెరపీ  ఇతర వైద్య సంబంధ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించింది గుజ్‌సెట్. ఈ క్రమంలో నీట్‌పై సుప్రీం ఇచ్చిన తీర్పుపై మరోమారు సుప్రీంలో పిటిషన్ వేశాం’ అని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి నితిన్ పటేల్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు