అగ్రవర్ణ కోటాపై ఇప్పుడే ఆదేశాలివ్వం: సుప్రీం

12 Mar, 2019 04:15 IST|Sakshi

న్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్ల కేసుపై ప్రస్తుత తరుణంలో తాము ఏ ఆదేశాలూ ఇవ్వదలచుకోవడం లేదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఈ నెల 28న ఈ కేసుకు సంబంధించిన వాదనలను తాము వింటామనీ, రాజ్యాంగ ధర్మాసనానికి దీనిని బదిలీ చేయాలా, వద్దా అన్న విషయాన్ని కూడా అప్పుడే పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ ఇప్పటికే పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే వారందరి కేసుల్లోనూ ఈ విషయాన్ని తాము తర్వాత పరిశీలిస్తామంటూ అన్ని పిటిషన్లనూ సుప్రీంకోర్టు వాయిదా వేస్తుండటం తెలిసిందే. ఈ పిటిషన్లపై స్పందన తెలపాల్సిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు గతంలోనే నోటీసులు పంపింది.  

ట్రిపుల్‌ తలాక్‌ ఆర్డినెన్స్‌పై పిటిషన్లు కొట్టివేత
ట్రిపుల్‌ తలాక్‌ను శిక్షార్హం చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను కేంద్రం పొడిగించటాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) ఆర్డినెన్స్‌ను గత ఏడాది సెప్టెంబర్‌ 19న ప్రభుత్వం జారీ చేసింది. దీని ప్రకారం.. ముస్లిం పురుషుడు తన భార్యకు మూడుసార్లు తలాక్‌ అని చెప్పి విడాకులివ్వడం శిక్షార్హం అవుతుంది. ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినా రాజ్యసభ వద్ద పెండింగ్‌లో ఉంది.

మరిన్ని వార్తలు