బానోకు 50 లక్షల పరిహారం, ఉద్యోగం ఇవ్వాల్సిందే

30 Sep, 2019 14:21 IST|Sakshi

గుజరాత్‌ సర్కార్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు

న్యూఢిల్లీ: గోద్రా అల్లర్ల బాధితురాలు బిల్‌కిస్‌ బానోకు రూ. 50 లక్షల నష్ట పరిహారంతోపాటు ఉద్యోగం, వసతిని సమకూర్చాలని అత్యున్నత న్యాయస్థానం సోమవారం గుజరాత్‌ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. గత ఏప్రిల్‌లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పున:సమీక్షించాలని గుజరాత్‌ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు కొట్టి పారేసింది. ఇక విచారించడానికి ఏమిలేదని, గత ఏప్రిల్‌ నెలలో సుప్రీంకోర్టు ఏదైతే  పరిహారం ఇవ్వాలని ఆదేశించిందో... దానినే అమలు చేయాలని మరోసారి స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. 2002 అల్లర్ల బాధితురాలైన బానోకు రెండు వారాల్లోగా ఉద్యోగం, వసతి కల్పించాలని ఆదేశించింది.

2002లో చోటుచేసుకొన్న గోద్రా అల్లర్లలో బిల్‌కిస్‌ బానో సామూహిక అత్యాచారానికి గురైంది. గుజరాత్‌లోని దహోద్‌లో ఆమెపై 22సార్లు అత్యాచారం చేయడమే కాక, మూడు సంవత్సరాల వయస్సున్న ఆమె కుమార్తెను అతిపాశవికంగా కొట్టి చంపారు. ఈ మారణకాండలో ఆమె తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయి, ఒక ఎన్జీవోలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం బాధితురాలు బిల్‌కిస్‌ బానో వయసు 40 సంవత్సరాలు. ఆమె  చదువు కూడా అంతంత మాత్రమే. 'బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన వారికి శిక్షపడినప్పటికి, మానవప్రకోపం కారణంగా ఆమె తీవ్రంగా నష్టపోయింది. బాధితురాలికి తగిన పరిహారం చెల్లించాలని నిర్ణయించడానికి విస్తృత చట్టాల కోసం వెతకవలసిన అవసరం లేదు. మనోవేదనను బట్టి నష్టపరిహారాన్ని నిర్ణయించవలసి ఉంటుంది’ అని సుప్రీంకోర్టు తన తుది తీర్పులో అభిప్రాయపడింది  

మరిన్ని వార్తలు