పర్యావరణానికి హాని కలిగించే క్రాకర్స్‌కు సుప్రీం నో..

23 Oct, 2018 08:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో బాణాసంచా నిషేధంపై సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. బాణాసంచా విక్రయాల తయారీ, విక్రయాలను నిషేధించలేమని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. లైసెన్స్‌ కలిగిన వ్యాపారులే బాణాసంచా విక్రయించాలని, ఆన్‌లైన్‌లో విక్రయాలు జరపరాదని పేర్కొంది. రాత్రి 8 గంటల నుంచి పది గంటల వరకే బాణాసంచా కాల్చాలని సూచించింది. పర్యావరణానికి హానికలిగించని క్రాకర్స్‌ను కాల్చాలని పేర్కొంది. కాగా అంతకుముందు బాణాసంచాపై నిషేధం విధించాలనే పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు తయారీదారుల ఉపాధి హక్కుతో పాటు దేశం‍లోని 130 కోట్ల మంది ఆరోగ్యంగా జీవించే హక్కు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు గతంలో పేర్కొంది.

రాజ్యాంగంలో ఆర్టికల్‌ 21 ప్రకారం జీవించే హక్కు అందరికీ సంబంధించినది కావడంతో బాణాసంచాపై దేశవ్యాప్త నిషేధం విధించే క్రమంలో సమతూకం పాటించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, బాణాసంచా పేలుళ్లతో ప్రజలపై పడుతున్న ప్రభావం వివరిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని కోరింది. తమిళనాడులో 1750 బాణాసంచా తయారీ పరిశ్రమలున్నాయని, వీటిలో 5000 కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నాయని కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. రూ 6000 కోట్ల బాణాసంచా పరిశ్రమ మనుగడను సైతం తాము తీసుకునే నిర్ణయం ప్రభావితం చేస్తుందని సుప్రీం బెంచ్‌ వ్యాఖ్యానించింది.

దేశవ్యాప్తంగా కాలుష్యం విపరీతంగా పెరగడంతో బాణాసంచా పేలుళ్లతో ఇవి తీవ్రమవుతున్నాయని, ప్రజల్లో శ్వాసకోశ వ్యాధులు తీవ్ర అనారోగ్య పరిస్థితులకు దారితీస్తున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు బాణాసంచాను పూర్తిగా నిషేధించరాదని, వీటిని క్రమబద్ధీకరించాలని బాణాసంచా తయారీదారులు కోరుతున్నారు. కాగా గత ఏడాది దీపావళికి ముందు అక్టోబర్‌ 9న ఢిల్లీలో బాణాసంచా విక్రయాలను తాత్కాలికంగా నిషేధించింది. ఈ ప్రాంతంలో కాలుష్య స్ధాయిలపై ప్రభావాన్ని అంచనా వేసేందుకు బాణాసంచా విక్రయాలను నిషేధించినట్టు సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొంది.

మరిన్ని వార్తలు