ఆర్టికల్‌ 370 రద్దు : పిటిషనర్‌పై సుప్రీం ఫైర్‌

16 Aug, 2019 12:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ అత్యంత లోపభూయిష్టంగా ఉందని పిటిషనర్‌ ఎంఎల్‌ శర్మను సర్వోన్నత న్యాయస‍్ధానం తీవ్రంగా మందలించింది. ఆర్టికల్‌ 370 రద్దుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన‍్ని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ అర్ధరహితంగా ఉందని పిటిషనర్‌, న్యాయవాది ఎంఎల్‌ శర్మను ఆక్షేపించింది. 

ఇదేం పిటిషన్‌ అంటూ ప్రశ్నించిన సుప్రీం కోర్టు ఈ పిల్‌ను కొట్టివేసేవారమని, కానీ ఈ అంశానికి సంబంధించి మరో ఐదు పిటిషన్లు రిజిస్టర్‌లో ఉన్నాయని పేర్కొంది. ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన ఈ పిటిషన్‌ను పరిశీలించేందుకు తాను అరగంట సమయం వెచ్చించినా విషయం ఏమీ లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ పేర్కొన్నారు. మరోవైపు లోపభూయిష్ట పిటిషన్‌ దాఖలు చేసిన మరో కశ్మీరీ అడ్వకేట్‌ షబిర్‌ షకీల్‌పై సైతం ప్రధాన న్యాయమూర్తి మండిపడ్డారు. ఇక ఆర్టికల్‌ 370పై దాఖలైన ఆరు పిటిషన్లలో లోపాలను సరిచేయాలని ఆయా న్యాయవాదులను కోరిన కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.

>
మరిన్ని వార్తలు