‘పద్మావత్‌’కే సుప్రీం మద్దతు ; రాష్ట్రాలకు చుక్కెదురు

23 Jan, 2018 13:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సంజయ్‌ లీలా భన్సాలీ ‘పద్మావత్‌’ సినిమాకు అత్యున్నత న్యాయస్థానంలో మరోసారి మద్దలు లభించింది. సినిమా విడుదలకు సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చబోనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సినిమా విడుదలను నిలిపేయాలంటూ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తులు మంగళవారం కొట్టివేశారు. దీంతో జనవరి 25న ‘పద్మావత్‌’ యధావిధిగా విడుదలకానుంది.

రాష్ట్రాలదే బాధ్యత : పద్మావత్‌ ప్రదర్శించలేమంటూ పిటిషన్‌ వేసిన రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ‘శాంతిభద్రత పరిరక్షణ రాష్ట్రాల బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించలేమని చేతులెత్తేయడం సరికాదు. జనవరి 25న సినిమా విడుదలవుతుందన్న గత ఆదేశాల్లో మార్పుల్లేవు’’ అని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

వెనక్కి తగ్గిన కర్ణిసేన? : అత్యున్నత న్యాయస్థానంలో పద్మావత్‌కు అనుకూలంగా తీర్పులు వస్తుండటంతో ఇరకాటంలోపడ్డ కర్ణిసేన పునరాలోచనలోపడ్డట్లు సమాచారం. సినిమాకు వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలకు నేతృత్వం వహిస్తోన్న కర్ణిసేనకు పద్మావత్‌ దర్శకుడు భన్సాలీ సైతం ప్రత్యేక లేఖ రాసిన సంగతి తెలిసిందే. ‘ముందు మీరంతా సినిమా చూడండి. ఆ తర్వాత మీ ఇష్టం..’ అని భన్సాలీ కోరారు. సోమవారం కూడా ఉధృతంగా సాగిన ఆందోళనలు.. మంగళవారం నాటికి కాస్త తగ్గుముఖం పట్టడాన్ని బట్టిచూస్తే భన్సాలీ లేఖకు సానుకూలఫలితం వచ్చినట్లేనని సినీవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆందోళన విరమించే విశయమై కర్ణిసేన ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు.

రక్షణ కల్పిస్తాం : ముంబై, హరియాణా పోలీసులు
‘పద్మావత్‌’ విడుదలకు సంబంధించి సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఆ సినిమాను ప్రదర్శించబోయే థియేటర్లకు రక్షణ కల్పిస్తామని ముంబై పోలీసు శాఖ ప్రకటించింది. అటు హరియాణా ప్రభుత్వం కూడా సినిమా హాళ్ల వద్ద పహారాకు హామీ ఇచ్చింది. థియేటర్‌ యాజమాన్యాలు ఆందోళనకు గురికావాల్సిన పనిలేదని పోలీసులు పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు