బాగా పరిశీలించాకే నిర్ణయం

13 Jul, 2018 03:00 IST|Sakshi

సెక్షన్‌ 377పై సుప్రీంకోర్టు ధర్మాసనం

న్యూఢిల్లీ: భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్‌ 377కు సంబంధించి చట్టబద్ధమైన ప్రామాణికతను అన్ని రకాలుగా పరిశీలించాకే రద్దుపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. భారత్‌లో స్వలింగ సంపర్కులపై తీవ్ర వివక్షకారణంగా అది వారి మానసిక ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపిందని అభిప్రాయపడింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పేర్కొనే 158 ఏళ్ల నాటి సెక్షన్‌ 377ను రద్దు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది.

ధర్మాసనం సెక్షన్‌ 377 రద్దుపై నిర్ణయం తీసుకునే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తమకే వదిలేసినప్పటికీ రాజ్యాంగపరంగా అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా సెక్షన్‌ 377ను కొనసాగించాలని, దీనిపై ప్రజాభిప్రాయం సేకరించాలని న్యాయవాదులు చేసిన ప్రతిపాదనను తిరస్కరించింది. ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదని దానికి రాజ్యాంగబద్ధత ఉందా లేదా అనేది చూడాలని అభిప్రాయపడింది.

కేంద్రం యూ టర్న్‌ తీసుకుందనడం సబబు కాదు
కేంద్రం ఈ కేసులో ‘యూ టర్న్‌’ తీసుకుందన్న న్యాయవాదుల ఆరోపణను, వారి వ్యతిరేకతను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. అయితే గోప్యతా హక్కుతో పాటు పలు తీర్పులను పరిగణనలోకి తీసుకుని చూస్తే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ‘యూ టర్న్‌’గా అభివర్ణించడం సబబు కాదని పేర్కొంది.

మరిన్ని వార్తలు