అయోధ్య కేసు: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

14 Mar, 2018 16:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సున్నితమైన బాబ్రీ మసీదు-అయోధ్య రాజజన్మ భూమి భూవివాదం కేసులో సుప్రీంకోర్టు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుతో  ప్రమేయమున్న అసలైన కక్షిదారులు (పార్టీలు) మాత్రమే తమ వాదనలు కొనసాగించేందుకు అనుమతించాలని నిర్ణయించింది. ఈ కేసులో తమను కూడా కక్షిదారులుగా భావించి తమ వాదనలు కూడా వినాలంటూ దాఖలైన మధ్యంతర అభ్యర్థనలన్నింటినీ సుప్రీంకోర్టు తిరస్కరించింది. బాబ్రీ మసీదు కేసులో అసలైన కక్షిదారుల వాదనలు మాత్రమే కొనసాగించేందుకు అనుమతించాలని, ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తులు జోక్యం కోరుతూ దాఖలు చేసిన అభ్యర్థనలను తిరస్కరించాలన్న విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎస్‌ఏ నజీబ్‌తో కూడిన ధర్మాసనం అంగీకరించింది.

ప్రస్తుతం  కొనసాగుతున్న విచారణలో జోక్యం కోరుతూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే, అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతంలోని రామ మందిరంలో పూజలు చేసే ప్రాథమిక హక్కు తనకు ఉందని స్వామి వేసిన రిట్‌ పిటిషన్‌ను పునరుద్ధరించేందుకు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా ఆస్తిహక్కు కంటే ప్రాథమిక హక్కు ఉన్నతమైందని తాను పేర్కొన్నట్టు స్వామి పీటీఐతో తెలిపారు.

మరిన్ని వార్తలు