మహారాష్ట్రలో మళ్లీ డాన్స్‌ బార్లు

18 Jan, 2019 02:53 IST|Sakshi

షరతులతో తెరుచుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతి

2016 నాటి చట్టంలోని కొన్ని నిబంధనల కొట్టివేత

న్యూఢిల్లీ: మహారాష్ట్రలో డాన్స్‌ బార్లు తిరిగి తెరుచుకునేందుకు మార్గం సుగమమైంది. వాటి పని విధానం, లైసెన్సుల మంజూరుపై కఠిన ఆంక్షలు విధిస్తూ 2016లో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని పలు నిబంధనల్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొన్ని షరతులతో డాన్స్‌ బార్లు తెరుచుకునేందుకు గురువారం అనుమతిచ్చింది. డాన్స్‌ బార్లపై నియంత్రణలు ఉండొచ్చు కానీ పూర్తి నిషేధం అమలుచేయొద్దని జస్టిస్‌ ఏకే సిక్రి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.

విద్యా సంస్థలు, ప్రార్థనా స్థలాలకు కిలోమీటరు దూరంలోపు డాన్స్‌ బార్లు ఏర్పాటుచేయొద్దన్న నిబంధనను కోర్టు తోసిపుచ్చింది. ముంబై లాంటి మహానగరాల్లో అనువైన చోట్ల స్థలం దొరకడం కష్టమేనని, కిలోమీటర్‌ నిబంధనను అమలుచేయలేమని స్పష్టతనిచ్చింది. పార్టీకి వచ్చిన వారు డాన్సర్లకు టిప్పులు ఇచ్చేందుకు అంగీకరించిన కోర్టు..వారిపై కరెన్సీ నోట్లు చల్లేందుకు నిరాకరించింది. డాన్స్‌ బార్లలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు అమర్చాలన్న నిబంధనను కొట్టివేస్తూ..అలాంటి ఏర్పాట్ల వల్ల డాన్సర్ల వ్యక్తిగత గోప్యత దెబ్బతింటుందని పేర్కొంది.  

సంపూర్ణ నిషేధం వద్దు..
‘2005 నుంచి మహారాష్ట్రలో ఒక్క డాన్స్‌ బార్‌కు కూడా లైసెన్స్‌ ఇవ్వలేదు. అలా జరగకూడదు. ఈ విషయంలో నియంత్రణలు ఉండొచ్చు కానీ సంపూర్ణ నిషేధం సరికాదు’ అని ధర్మాసనం పేర్కొంది. నైతిక ప్రమాణాలు కాలంతో పాటే మారతాయని, నైతికత పేరిట ప్రభుత్వం సామాజిక నియంత్రణ చెలాయించకూడదని సూచించింది. ఇకపై డాన్స్‌ బార్‌ల కోసం వచ్చే దరఖాస్తులను ప్రభుత్వం ఓపెన్‌ మైండ్‌తో అంగీకరిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంది.  2016 నాటి చట్టాన్ని సవాలుచేస్తూ హోటల్, రెస్టారెంట్‌ యజమానులు దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టును తన తీర్పును గతేడాది ఆగస్టులోనే రిజర్వు చేసింది. గతంలో సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాల్ని బేఖాతరు చేసేందుకే మహారాష్ట్ర ప్రభుత్వం..డాన్స్‌ బార్ల లైసెన్సింగ్‌కు కఠిన ఆంక్షలు విధిస్తూ చట్టం తెచ్చిందని పిటిషన్‌దారులు ఆరోపించారు.

ప్రభుత్వ వాదన బలహీనం: ఎన్‌సీపీ
బార్‌ యాజమాన్యాల అసోసియేషన్‌తో మహారాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కయిందని ప్రతిపక్ష నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్‌సీపీ) ఆరోపించింది. అందుకే కేసులో ప్రభుత్వ వాదన చాలా బలహీనంగా ఉందని దుయ్యబట్టింది. రాష్ట్రంలో డాన్స్‌ బార్లు తిరిగి తెరుచుకోకుండా సీఎం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. బార్‌ల నియంత్రణ చట్టాన్ని లోపరహితంగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వం విఫలమైందని శివసేన మండిపడింది. సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర హోం మంత్రి రంజిత్‌ పాటిల్‌ స్పందిస్తూ..డాన్స్‌ బార్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరగనీయమని హెచ్చరించారు.

షరతులతో డాన్స్‌ బార్లు తిరిగి తెరుచుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతివ్వడం పట్ల సామాజిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. బార్‌ డాన్సర్ల హక్కుల కోసం పోరాడుతున్న భారతీయ బార్‌ గరŠల్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు వర్ష కాలె..సుప్రీంకోర్టు తీర్పును గొప్ప విజయంగా అభివర్ణించారు. తాజా తీర్పు ప్రగతిశీలమైనదని మాజీ బ్యూరోక్రాట్, హక్కుల కార్యకర్త అభా సింగ్‌ అన్నారు. కోర్టు మొదటి నుంచీ నృత్యాన్ని ఒక వృత్తిగానే పరిగణించిందని, కానీ రాష్ట్ర సర్కారు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో ఇలాంటి మహిళల జీవించే హక్కుకు భంగం వాటిల్లిందన్నారు.

తీర్పు ముఖ్యాంశాలు
► డాన్సర్లకు టిప్పులు ఇవ్వొచ్చు కానీ నోట్లు వెదజల్లరాదు

► బార్‌ రూమ్, డాన్స్‌ ఫ్లోర్‌ మధ్య అడ్డుతెర తప్పనిసరి కాదు

► డాన్స్‌ బార్లలో సీసీటీవీలు అమర్చొద్దు

► సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11.30 గంటల మధ్యే పనిచేయాలి

► విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలకు కిలోమీటరు దూరంలో బార్‌ డాన్స్‌లు ఉండొద్దన్న నిబంధన అమలు అసాధ్యం

► చివరి పదేళ్లుగా నేరచరిత్ర లేని వారికే లైసెన్స్‌ మంజూరు చేయాలని పేర్కొనడం నిర్దిష్టంగా లేదు. అది అధికారుల విచక్షణకు వదిలేసినట్లుగా ఉంది.

నైట్‌ ‘లైఫ్‌’... డాన్స్‌ బార్స్‌!
మెట్రో నైట్‌ లైఫ్‌లో డాన్స్‌ బార్స్‌ విడదీయలేని ఓ భాగం. ముంబై మహానగర సంస్కృతిలోకి చేరిన ఈ డాన్స్‌ బార్లు, వాటిలో చిందులు వేసే డాన్సర్ల చుట్టూ ఎన్నో విమర్శలు,  మరెన్నో విషాదాలు ఉన్నాయి. మహారాష్ట్రలో 1980 తొలినాళ్లలో ముంబైకి 75 కి.మీ. దూరంలో ఉన్న ఖలాల్‌పూర్‌లో బేవాచ్‌ అన్న పేరుతో మొట్టమొదటిసారిగా ఈ డాన్స్‌బార్‌ ప్రారంభమైంది. ఇక్కడ డాన్స్‌ చేసేందుకు 500–600 మంది డాన్సర్లను ముంబై, థానేల నుంచి బస్సుల్లో తీసుకొని వచ్చేవారు.

రాత్రంతా తాగుతూ, అమ్మాయిలు డ్యాన్స్‌లు చేస్తుంటే వారిపై కరెన్సీ నోట్లు విసురుతూ ఎంజాయ్‌ చేసే ఈ కల్చర్‌ కార్చిచ్చులా మహారాష్ట్ర అంతటా వ్యాపించింది. కొన్ని బార్లను అధికారికంగా నిర్వహిస్తే, అనధికారికంగా నిర్వహించే వాటికి లెక్కే లేదు. ఈ బార్లలో చిందులేసే డాన్సర్లు కొందరు కోటికి పడగలెత్తారు. మరికొందరు గౌరవప్రద జీవితాన్ని కూడా నోచుకోక పూట గడవడానికి ఇబ్బంది పడ్డవారూ ఉన్నారు. తరన్నూమ్‌ అనే డాన్సర్‌ ఎంత సంపాదించారంటే, ఆదాయ పన్ను శాఖ ఆమె ఇంటిపై దాడులు కూడా చేసింది. బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు మాధుర్‌ బండార్కర్‌ టబూ ప్రధాన పాత్రధారిగా చాందినీబార్‌ అనే సినిమాను బార్‌ డాన్సర్‌ ఇతివృత్తంతో రూపొందించారు. టబూ ఈ చిత్రానికిగాను జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని సైతం కైవసం చేసుకున్నారు.

14 ఏళ్లుగా వివాదం
డాన్స్‌ బార్లతో యువత నాశనమవుతున్నారని, ఆ బార్ల మాటున చీకటి వ్యాపారం జరుగుతోందని, అమ్మాయిలు బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి వెళ్తున్నారనే∙కారణాలతో 2005లో డాన్స్‌ బార్లను మహారాష్ట్ర సర్కారు నిషేధించింది. దీంతో కొన్ని వేలమంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. డాన్స్‌ బార్ల యజమానులు, డాన్స్‌  గర్ల్స్‌ కోర్టుకెక్కారు. 2006లో  బొంబాయి హైకోర్టు ఆ నిషేధాన్ని ఎత్తేసింది. అప్పట్లో సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిషేధాన్ని కొనసాగించింది.  2013లో డాన్స్‌ బార్లపై నిషేధాన్ని కొట్టేసింది. దాంతో, 2014 జూన్‌లో తిరిగి మహారాష్ట్ర ప్రభుత్వం డాన్స్‌ బార్లపై కొన్ని ఆంక్షలు విధిస్తూ చట్టానికి సవరణలు చేసింది. దానిపై బార్ల యజమానులు, డాన్స్‌ గర్ల్స్‌ మళ్లీ కోర్టుకు ఎక్కడంతో సుప్రీంకోర్టు బార్ల నిషేధంపై 2015, అక్టోబర్‌ 15న స్టే విధించింది. ఇప్పుడు ఆ ఆంక్షలలో కొన్నింటిని సమర్థిస్తూ, మరికొన్నింటిని వ్యతిరేకిస్తూ తీర్పు చెప్పింది.


మరిన్ని వార్తలు