‘కేసుల కేటాయింపు’పై తీర్పు రిజర్వు

28 Apr, 2018 01:32 IST|Sakshi

న్యూఢిల్లీ: కేసుల కేటాయింపు (రోస్టర్‌)పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉన్న ప్రత్యేక అధికారాలను తొలగించాలన్న పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. కేసుల కేటాయింపు బాధ్యతను ఐదుగురు జడ్జీల కొలీజియంకు అప్పగించాలని కేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్‌ వేసిన పిటిషన్‌ ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది.

ఫలానా కేసు తనకు కేటాయించలేదని లేదా ఎందుకు కేటాయించరంటూ కొందరు జడ్జీలు అసంతృప్తికి గురయిన సందర్భాలు కూడా హైకోర్టుల్లో ఉన్నాయని విచారణ సందర్భంగా జడ్జి సిక్రి అన్నారు. పిటిషనర్‌ తరఫున దుశ్యంత్‌ దవే, ప్రశాంత్‌ భూషణ్‌ వాదిస్తూ.. సున్నితమైన కొన్ని కేసుల బాధ్యతను కొన్ని బెంచ్‌లకే అప్పగించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ‘మాస్టర్‌ రోస్టర్‌’గా సీజేఐకు అపరిమిత అధికారం ఉన్నట్లు కాదని తెలిపారు.

సుప్రీంజడ్జిగా ఇందూ ప్రమాణం
సీనియర్‌ న్యాయవాది ఇందూ మల్హోత్రా(61) సుప్రీం న్యాయమూర్తిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మిశ్రా ఆమెతో ప్రమాణం చేయించారు. ఈమె రాకతో సుప్రీంజడ్జీల సంఖ్య 25కు చేరుకుంది. దీంతో న్యాయవాది నుంచి నేరుగా సుప్రీం కోర్టు జడ్జిగా ఎన్నికైన తొలి మహిళగా ఆమె నిలిచారు. సుప్రీం చరిత్రలో ఒకేసారి ఇద్దరు మహిళా జడ్జీలు పనిచేయడం ఇది మూడోసారి.

మరిన్ని వార్తలు