మూలాలకు వెళ్లి దర్యాప్తు చేస్తాం

25 Apr, 2019 03:38 IST|Sakshi

సీజేఐపై ఆరోపణల వెనుక పెద్ద కుట్ర ఉందన్న న్యాయవాది పోస్ట్‌పై సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల విషయంలో లోతైన మూలాలకు వెళ్లి దర్యాప్తు చేస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ ఆరోపణల వెనుక చాలా పెద్ద కుట్రే దాగి ఉందని ఓ న్యాయవాది సంచలన వ్యాఖ్యలు చేయడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. న్యాయవ్యవస్థపై ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ పోతుంటే న్యాయవ్యవస్థే కాదు తాము కూడా మిగలమని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్‌ వ్యాఖ్యానించింది. జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌పై ఆరోపణల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, దీనిపై తన వద్ద ఆధారాలున్నాయని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన న్యాయవాది ఉత్సవ్‌ సింగ్‌ బైన్స్‌ను.. గురువారంలోగా మరో అఫిడవిట్‌ దాఖలు చేయాలని బుధవారం ధర్మాసనం ఆదేశించింది.

గురువారం విచారణ చేపడతామని పేర్కొంది. అయితే ఉత్సవ్‌ సింగ్‌ బైన్స్‌ చేసిన వ్యాఖ్యలపై జరిపే విచారణకు, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌పై వచ్చిన ఆరోపణపై అంతర్గత విచారణకు ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేసింది. సీబీఐ, ఐబీ, ఢిల్లీ పోలీస్‌ చీఫ్‌లు తమ ముందు హాజరుకావాల్సిందిగా బుధవారం ఉదయం ధర్మాసనం ఆదేశించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)తో దర్యాప్తు జరిపించాలని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాలను ధర్మాసనం ఆదేశించింది. సుప్రీం కోర్టు తీర్పులను ప్రభావితం చేసేందుకు కొందరు వ్యక్తులు చాలా పెద్ద కుట్ర పన్నారంటూ ఏప్రిల్‌ 20న ఫేస్‌బుక్‌లో ఉత్సవ్‌ సింగ్‌ బైన్స్‌ సంచలన పోస్ట్‌ పెట్టారు. విచారణ సందర్భంగా ఉత్సవ్‌ సింగ్‌ బైన్స్‌పై సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా మండిపడింది.

మరిన్ని వార్తలు