ఎస్సీ, ఎస్టీ బిల్లుకు ఓకే

22 Dec, 2015 01:47 IST|Sakshi

ఆమోదించిన రాజ్యసభ.. వారిపై నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు
 
 న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలపై దాడులకు, ఇతర అమానుష నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు ఉద్దేశించిన ఎస్సీ, ఎస్టీ(అకృత్యాల నిరోధం) సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. లోక్‌సభలో ఆగస్టులో గట్టెక్కిన ఈ బిల్లును రాజ్యసభ సోమవారం ఎలాంటి చర్చా లేకుండానే కొన్ని నిమిషాల్లోపే ఏకగ్రీవంగా ఆమోదించింది. 1989 నాటి చట్టంలో మార్పుల కోసం ఈ సవరణ బిల్లు తెచ్చారు. బిల్లు ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలపై నేరాలు, వారి భూములను అక్రమించడం, ఆ వర్గాల మహిళలను దేవదాసీలుగా మార్చడం , లైంగికంగా వేధించడం వంటి వాటికి పాల్పడితే క ఠిన శిక్షలు వేయాలని ప్రతిపాదించారు. ఇలాంటి నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని, బాధితులకు పునరావాసం కల్పించాలని పేర్కొన్నారు.  ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆ వర్గాలకు చెందని ప్రభుత్వాధికారులకు ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష వేయాలని ప్రతిపాదించారు.

 ద్రవ్య, జలమార్గాల బిల్లులకు ఆమోదం
 రక్షణశాఖకు పెన్షన్లు, స్వచ్ఛ భారత్ పథకానికి నిధులు సహా వివిధ కార్యక్రమాల కోసం ప్రభుత్వం అదనంగా రూ. 56,256.32 కోట్లను ఖర్చు చేసేందుకు ఉద్దేశించిన రెండు ద్రవ్య వినిమయ బిల్లులకు రాజ్యసభ సోమవారం ఆమోదం తెలిపింది. 101 జలమార్గాల అభివృద్ధికి ఉద్దేశించిన జాతీయ జలమార్గాల బిల్లు-2015ను లోక్‌సభ ఆమోదించింది. భగవద్గీతను జాతీయ పుస్తకంగా ప్రకటించాలని బీజేపీ సభ్యులు లోక్‌సభలో గట్టిగా డిమాండ్ చేశారు.

 పార్లమెంట్‌లో ప్రభుత్వం తెలిపిన వివరాలు
 లోక్‌సభ స్థానాల్లో కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేసే ప్రణాళిక ఉంది. విద్యుత్ సరఫరాలేని 18,452 గ్రామాల్లో ఇప్పటివరకు 3,286 గ్రామాల్లో విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి.  యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కోసం ఎంపిక చేయాల్సిన జాబితాలో భారత్ నుంచి 46 ప్రదేశాలు పోటీపడుతున్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా