ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయండి

16 Jun, 2018 02:22 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రభుత్వోద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల ఉన్నతాధికారుల్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సుప్రీం తీర్పును అనుసరించి పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కొనసాగించవచ్చని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ అన్ని విభాగాలకు ఉత్తర్వులు జారీచేస్తూ.. ‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అధికారులు పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలి. అదే సమయంలో ఉత్తర్వుల్లో తప్పనిసరిగా .. ‘పదోన్నతి సుప్రీం కోర్టు తుది ఆదేశాలకు లోబడి ఉంటుంది’ అని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో తగిన చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ఒక అధికారి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రభుత్వోద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కొనసాగించవచ్చని జూన్‌ 5న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంలో చట్టానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లవచ్చని పేర్కొంది.   

మరిన్ని వార్తలు