మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే

20 Jul, 2018 18:23 IST|Sakshi

నీట్‌ విద్యార్థులకు మార్కులు జత చేయాలన్న మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే

సాక్షి, న్యూఢిల్లీ : వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌ను తమిళ భాషలో రాసిన విద్యార్థులకు గ్రేస్‌ మార్కుల కింద 196 మార్కులు జత చేయాలంటూ మద్రాస్‌ హైకోర్టు ఇటీవల జారీచేసిన ఆదేశాలపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. మద్రాస్‌ హైకోర్టు ఆదేశాన్ని తప్పుపడుతు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సుప్రీంకోర్టు పిట్‌ దాఖలు చేసింది. ఈ  పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ ఎ ఎస్‌ బాంబ్డే, ఎల్‌ నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం మద్రాస్‌  హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ఈ పద్దతిలో విద్యార్థులకు మార్కులు ఇవ్వలేమని, ఇరువురు సమావేశమై సమస్యను పరిష్కారించాలని న్యాయస్థానం పేర్కొంది.

నీట్‌ పరీక్షా ప్రశ్నాపత్రంలోని తమిళ భాష అనువాదంలో తప్పులు దొర్లాయంటూ సీపీఐ(ఎమ్‌) నేత టీకే రంగరాజన్‌ మద్రాస్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. 49 ప్రశ్నలు తప్పుగా అనువాదం చేసినందు వల్ల గందరగోళానికి గురైన విద్యార్థులు మార్కులు కోల్పోయారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మధురై బెంచ్‌ సీబీఎస్‌ఈ తీరును తప్పు పట్టింది. తమిళ భాషలో పరీక్ష రాసిన విద్యార్థులకు గ్రేస్‌ మార్కుల కింద 196 మార్కులు జత చేయాలంటూ మధురై బెంచ్‌ సీబీఎస్‌ఈను ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలతో సుమారు 24 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

మరిన్ని వార్తలు