హజేలాను మధ్యప్రదేశ్‌కు వెంటనే పంపండి: సుప్రీం

19 Oct, 2019 10:31 IST|Sakshi

న్యూఢిల్లీ: అస్సాం జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్నార్సీ) సమన్వయకర్తగా పనిచేస్తున్న ప్రతీక్‌ హజేలాను వెంటనే మధ్యప్రదేశ్‌కు పంపాలని కేంద్రానికి, అస్సాం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. సాధ్యమైనంత ఎక్కువ కాలం అతడిని పంపేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం సూచించింది. 1995 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన హజేలా మధ్యప్రదేశ్‌కు చెందినవారు. ఆయన స్వరాష్ట్రానికి ఆయన్ను డిప్యుటేషన్‌ మీద పంపాలని కోర్టు సూచించింది. ప్రస్తుతం ఆయన అస్సాంలో ఎన్నార్సీ జాబితా మీద పనిచేస్తున్నారు.

బదిలీ వెనుక కారణమేమిటని కేంద్రం తరఫున వాదిస్తున్న అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ ప్రశ్నించారు. కారణం లేకుండా చర్యలు తీసుకుంటామా ? అని కోర్టు తిరిగి ప్రశ్నించింది. ఆయన్ను పంపడానికి గల కారణాన్ని మాత్రం సుప్రీంకోర్టు వెల్లడించలేదు.  ఈ క్రమంలో ఆయనకు ప్రమాదం ఉందంటూ పలు ఊహాగాలను ఊపందుకున్నాయి. అస్సాం ఎన్నార్సీ చివరి దశకు చేరుకోవడంతో ఆ అంశం సున్నితత్వం రీత్యా దాడులు జరిగేందుకు అవకాశం ఉందని అందుకే బదిలీ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించిందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. అస్సాం ఎన్నార్సీ పిటిషన్‌ను నవంబర్‌ 26న మళ్లీ విచారించనుంది. అస్సాం నుంచే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ పదవీకాలం నవంబర్‌ 17తో ముగియనుంది.  

>
మరిన్ని వార్తలు