బెంగాల్‌ ‘టీ కప్పులో తుఫాను’

18 Nov, 2019 18:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘టీ కప్పులో తుఫాను’ అంటే ఇదేనేమో! అది పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని జల్ఫాయిగురి పర్వత ప్రాంతం. గత జూలై ఒకటవ తేదీన చుపార తేయాకు తోటలో వాతావరణం చల్లాగా ఉంది. అప్పుడప్పుడు వర్షం జల్లులు కురుస్తున్నాయి. కార్మికుల కాలనీ ఇళ్ల నుంచి ఒక్కొక్కరుగా వందల మంది విద్యార్థినీ విద్యార్థులు బయటకు వచ్చి తేయాకు తోటంతా నినాదాలు చేస్తూ ప్రదర్శన జరిపారు. తాము స్కూల్‌కు వెళ్లి రావడానికి రెండు బస్సులనైనా నడపాలి లేదా రెండు ట్రిప్పులనైనా నడపాలంటూ వారు నినదించారు.

ఆ మరుసటి రోజు 400 మంది విద్యార్థినీ విద్యార్థులు తేయాకు తోటకొచ్చే దారులన్నింటిని దిగ్బంధనం చేశారు. తేయాక తోట యాజమాన్యం బెదిరింపులకు, కార్మిక నాయకుల బుజ్జగింపులకు వారు ఏమాత్రం లొంగలేదు. అలాగే వారం పాటు స్కూల్‌కు పోకుండా, తేయాకు తోటలో పనులు జరగకుండా అడ్డుకున్నారు. 1980లో పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో  ఉన్న వామపక్ష ప్రభుత్వానికి, తేయాకు తోటల యాజమానుల సంఘం మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం పనిచేసే చోటే కార్మికులకు వసతి కల్పించడంతోపాటు వారి పిల్లలు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు స్కూల్‌ బస్సులను తేయాకు తోటల యాజమాన్యమే సమకూర్చాలి.

అయితే చుపార తేయాకు తోటలో 150 మంది విద్యార్థిని విద్యార్థులు ఉండగా, తోట యాజమాన్యం ఒక స్కూల్‌ బస్సును ఒకే ట్రిప్‌ నడుపుతోంది. అంత మందికి అందులో ఊపిరాడకుండా ఉండడంతో విద్యార్థినీ విద్యార్థులు విడతల వారీగా స్కూల్‌ ఎగ్గొడుతూ వచ్చారు. తమ బాధ గురించి వారు తల్లిదండ్రులకు చెప్పుకున్నా ప్రయోజనం లేకపోవడంతో వారే ప్రత్యక్షంగా ఆందోళనకు దిగారు. ఎప్పటిలాగానే తేయాకు తోట యాజమాన్యం తేయాకు తోటను మూసివేస్తానని, బస్సులను బంద్‌ చేస్తామని బెదిరించింది. అయినా విద్యార్థులు ఆందోళన విరమించక పోవడంతో యాజమాన్యమే దిగివచ్చి రెండు ట్రిప్పులు బస్సు నడిపేందుకు అంగీకరించింది.

2002, 2007లో మొత్తం 17 తేయాకు తోటలు మూత పడడం వల్ల 1200 మంది కార్మికులు ఆకలితో మరణించారు. కొన్ని వేల మంది కార్మికులు సిక్కిం, భూటాన్, ఢిల్లీ, కేరళ, బెంగళూరు ప్రాంతాలకు వలసపోయారు. ఒప్పందం మేరకు చుపార యాజమాన్యం వారం రోజులకు మించి బస్సును రెండు ట్రిప్పులు నడపలేదు. శాశ్వత కార్మికుల పిల్లల కోసం బస్సు సౌకర్యాన్ని కొనసాగిస్తూ తాత్కాలిక కార్మికుల పిల్లలకు బస్సు సౌకర్యాన్ని ఎత్తివేసింది. దుమ్కా, హజారీబాగ్, రాంచీ, చైబాస ప్రాంతాల్లోని తేయాకు తోటల యాజమాన్యాలు కూడా ఇదే పద్ధతిని పాటిస్తున్నాయి. ఆ తేయాకు తోటల్లో నాలుగున్నర లక్షల మంది కార్మికులు పనిచేస్తుండగా, వారిలో 2.62 లక్షల మంది కార్మికులు మాత్రమే శాశ్వత ఉద్యోగులు. తునికాకు ఏరే కార్మికులకు రోజుకు రూ.297 చెల్లిస్తుండగా, తేయాకు తోట కార్మికులకు రోజుకు రూ.176 మాత్రమే చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు 20, 30 కిలోమటర్ల దూరంలో ఉండే పాఠశాలలకు కార్మికులు తమ పిల్లలను ఎలా పంపిస్తారు?

స్త్రీ, పురుషులకు సమాన వేతనం చెల్లించాలంటూ భారత పార్లమెంట్‌ 1976లో చట్టం తీసుకరావడానికి ముందే, అంటే 1974లో బెంగాల్‌లోని ‘సొనాలి గార్డెన్‌’ తేయాకు తోట యాజమాన్యం స్త్రీ, పురుషులకు సమాన వేతనం చెల్లించడంతోపాటు 1977లో అధిక లాభాలు రావడంతో కార్మికుల వేతనాలను ఒక్కసారిగా రెట్టింపు చేసింది. అలాంటి సంస్థ కూడా ఇతర తోటల యాజమానుల ఒత్తిడులకు తలొగ్గి వారి బాటనే నడుస్తోంది.

ఇప్పుడు ‘టీ కప్పులో తుఫాను’ లాగానే చుపార తేయాకు విద్యార్థుల ఆందోళన పూర్తిగా చల్లబడింది. తోటి విద్యార్థిని విద్యార్థుల్లో సగం మంది బడి మానేసినా వారిలో చలనం లేదు. కార్మిక నాయకులు ఎప్పటిలాగే మౌనం పాటిస్తున్నారు. విద్యార్థులకు తేయాకు తోటల యాజమాన్యం బస్సు సౌకర్యం కల్పించనప్పుడు రాష్ట్ర ప్రభుత్వమైనా కల్పించాలి. ఎన్నికల నిధుల కోసం తేయాకు తోటల యాజమాన్యాల మీద ఆధారపడే ప్రభుత్వాలు ఆ దిశగా ఎందుకు ఆలోచిస్తాయి!

మరిన్ని వార్తలు