అయోధ్య తీర్పు : విద్యాసంస్ధల మూసివేత

9 Nov, 2019 08:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య వివాదంపై శనివారం సుప్రీం కోర్టు తీర్పు వెలువడనుండటంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్‌ ప్రకటించారు. మధ్యప్రదేశ్‌, యూపీ, జమ్ము కశ్మీర్‌, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు మూసివేశారు. యూపీలో ముందుజాగ్రత్త చర్యగా శనివారం నుంచి సోమవారం వరకూ విద్యాసంస్థలను మూసివేసినట్టు అధికారులు ప్రకటించారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోనూ ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్‌ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు గోవా, యూపీ, జమ్ము కశ్మీర్‌ సహా పలు రాష్ట్రాల్లో 144 సెక్షన్‌ విధించారు. భోపాల్‌, బెంగళూర్‌లలో నిషేధాజ్ఞలు విధించారు.

బెంగళూర్‌లో శనివారం ఉదయం ఏడు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని పోలీస్‌ కమిషనర్‌ భాస్కర్‌ రావు పేర్కొన్నారు. మరోవైపు జమ్ము కశ్మీర్‌లో పరీక్షలు వాయిదా వేసిన అధికారులు శనివారం మద్యం విక్రయాలు ఉండవని డ్రైడేగా ప్రకటించారు. ఇక హైదరాబాద్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను నియమించామని, హైదరాబాద్‌లో శాంతి భద్రతల పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు