కలెక్టర్‌గా నియమితులైన పాఠశాల విద్యార్థిని

3 Mar, 2020 18:55 IST|Sakshi

ముంబై : మహారాష్ట్రలోని ఓ జిల్లాలో పాఠశాల విద్యార్థిని కలెక్టర్‌గా నియమితులయ్యారు. అదేంటి స్కూల్‌ విద్యార్థిని కలెక్టర్ అవ్వడం ఏంటని అనుకుంటున్నారా. అసలు విషయమేంటంటే.. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా ప్రతిఏటా ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలకు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో ఓ జిల్లా అధికారి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. బుల్దానా జిల్లా కలెక్టర్‌ సుమన్‌ రావత్‌.. వారం రోజుల పాటు వివిధ పాఠశాలలోని ప్రతిభావంతులైన విద్యార్థినిలకు ఒక్క రోజు కలెక్టర్‌గా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా నిన్న(సోమవారం) జిల్లా పరిషత్‌ పాఠశాల నుంచి పూనమ్‌ దేశ్‌ముఖ్‌ అనే విద్యార్థినిని ఒక్క రోజు కలెక్టర్‌గా ఎంపిక చేశారు.

ఈ విషయంపై కలెక్టర్‌ సుమన్‌ రావత్‌ స్పందిస్తూ.. "అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణలో భాగంగా.. వారం పాటు ప్రతిభావంతులైన అమ్మాయిలను ఒక్క రోజు కలెక్టర్‌గా ఉండటానికి అవకాశం ఇస్తున్నాం. దీనిలో భాగంగానే ఈరోజు జిల్లా పరిషత్ స్కూల్ నుంచి విద్యార్థిని పూనమ్ దేశ్ ముఖ్‌ను ఎంపిక చేశాం.’ అని ట్విటర్‌ వేదికగా తెలిపారు. దీనితో పాటు  విద్యార్థిని కలెక్టర్‌ కుర్చీలో కూర్చొని ఉన్న ఫోటోను కూడా షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్ల కలెక్టర్‌ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు ఉన్నత స్థానంలో ఉండటానికి ఈ ఆలోచన ప్రోత్సహిస్తుందని కలెక్టర్‌ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.

కాగా 1908 సంవత్సరం మార్చి 8వ తేదీన ఉత్తర అమెరికాలోని మహిళలు తమకు ఉద్యోగాలలో సమాన అవకాశాలు, వేతనలు కావాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన ఉద్యమం చేపట్టారు. ఈ చారిత్రక నేపథ్యాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా మార్చి 8 తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. కొన్ని దేశాలు మహిళా దినోత్సవాన్ని ప్రభుత్వ సెలవు దినంతో ప్రకటించాయి.

మరిన్ని వార్తలు